సొంత మనుషుల్ని నమ్మితే ఫలితాలు ఇలా ఉంటాయి..
సెల్ఫ్ అసెస్ మెంట్, సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేది సీఎం కేసీఆర్ బలంగా నమ్మిన సిద్ధాంతం అని అన్నారు మంత్రి కేటీఆర్. ఈ రెండు విధానాలు ప్రజలకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.
సొంత మనుషుల్ని నమ్మితే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి TS-iPASS, TS-bPASS గొప్ప ఉదాహరణలు అని చెప్పారు మంత్రి కేటీఆర్. సెల్ఫ్ అసెస్ మెంట్, సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేది సీఎం కేసీఆర్ బలంగా నమ్మిన సిద్ధాంతం అని అన్నారు. ఈ రెండు విధానాలు ప్రజలకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉన్నాయని, ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాయని అన్నారు.
ఆస్తిపన్ను చెల్లించేందుకు ప్రజలు స్వీయ ధృవీకరణ ఇచ్చేలా 2019లో TS-bPASS విధానాన్ని తెరపైకి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి ప్రజలనుంచి ఊహించని స్పందన వచ్చింది. సెల్ఫ్ అసెస్ మెంట్ ద్వారా ప్రభుత్వానికి నష్టం వస్తుందనే అనుమానాలున్నా ప్రభుత్వం ధైర్యంగా ఈ విధానాన్ని అమలులో పెట్టింది. అయితే సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడుతూ 2.88 లక్షలమంది రిజిస్ట్రేషన్ల సమయంలోనే ఈ విధానాన్ని ఉపయోగించుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికే 1.79 లక్షల మంది ఆస్తిపన్ను విషయంలో సెల్ఫ్ అసెస్ మెంట్ ని ఎంపిక చేసుకున్నారు. బిల్డింగ్ ప్లాన్ కి అనుమతి ఇచ్చే సమయంలోనే 1.2 లక్షలమంది TS-bPASS ని ఎంపిక చేసుకున్నారు. ఆటో మ్యుటేషన్ల ప్రక్రియ కూడా విజయవంతమైంది.
తెలంగాణ మున్సిపల్ చట్టం-2019 ప్రకారం ఆన్ లైన్లోనే అన్ని సర్టిఫికెట్లు అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. 2022 నుంచి జనన, మరణ ధృవీకరణ సర్టిఫికెట్ల జారీలో తీసుకొచ్చిన నూతన విధానం కూడా తెలంగాణలో విజయవంతమైంది. 1.12 లక్షల బర్త్ సర్టిఫికెట్లు జారీ చేశారు. ప్రభుత్వ సేవలను ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా వినియోగించుకునే అవకాశం లభించడంతో ప్రజలకు ఆఫీస్ ల చుట్టూ తిరిగే భారం తగ్గింది.