ప్రజలు క్యూలైన్లో ఉంటే ఎగ్జిట్ పోల్స్ ఎలా విడుదల చేస్తారు..?

ప్రజలు ఇంకా లైన్‌ లో నిలబడి ఓట్లు వేస్తున్న సమయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించడమేంటని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. అసలు ఏ లాజిక్‌తో ఎగ్జిట్‌ పోల్స్‌ ఇస్తున్నారో అర్థం కావట్లేదన్నారు.

Advertisement
Update:2023-11-30 19:23 IST

ఎగ్జిట్ పోల్స్ విడుదల తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ అధికారికంగా పూర్తయినా కొన్ని చోట్ల ఓటర్లు ఇంకా క్యూ లైన్లలోనే ఉన్నారని అలాంటి సమయంలో ఎగ్జిట్ పోల్స్ ని ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. ఐదున్నర గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడం సరికాదన్నారు. ఇదే విషయాన్ని తాము ఈసీ అధికారుల దగ్గర ప్రస్తావిస్తే.. అది కేంద్ర ఎన్నికల సంఘం ముందుగానే తీసుకున్న నిర్ణయం అని చెప్పారన్నారు.


ప్రజలు ఇంకా లైన్‌ లో నిలబడి ఓట్లు వేస్తున్న సమయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించడమేంటని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. అసలు ఏ లాజిక్‌తో ఎగ్జిట్‌ పోల్స్‌ ఇస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ హాస్యాస్పదంగా అనిపిస్తున్నాయని చెప్పారు. ఒకవేళ డిసెంబర్‌ 3న ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పు అయితే.. తప్పు జరిగిందని తెలంగాణ ప్రజలకు ఆయా సంస్థలు క్షమాపణలు చెబుతాయా? అని ప్రశ్నించారు.

అసలు పోలింగ్ శాతమే ఇంకా తేలలేదని అన్నారు మంత్రి కేటీఆర్. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ పూర్తయితే నిమిషాల వ్యవధిలో పోలింగ్ శాతం ఎలా బయటకొస్తుందని ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం లెక్కలన్నీ పక్కాగా తేలతాయని, అప్పుడు ఎగ్జిట్‌ పోల్స్ గురించి మాట్లాడుకోవచ్చన్నారు కేటీఆర్. ఏది ఏమయినా బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ తప్పు అని తేలే సమయం వచ్చిందని, అవి తప్పు అని డిసెంబర్ 3న నిరూపిస్తామని చెప్పారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టడం గ్యారెంటీ అని అన్నారు కేటీఆర్. 


Tags:    
Advertisement

Similar News