ధరణి కావాలా..? దరిద్రం కావాలా..?
రాష్ట్రంలో ఎక్కడైనా 3గంటల కరెంటుతో 3 ఎకరాల పొలం పండించే రైతులు మీ వద్ద ఉన్నారా? అని ప్రశ్నించారు కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 గంటలే కరెంటు ఇస్తారని, 10హెచ్పీ మోటార్లంటూ రచ్చ చేస్తారని, రైతులు ఆలోచించుకోవాలని చెప్పారు.
కాంగ్రెస్ కావాలా..? కరెంటు కావాలా..? అంటూ ఇప్పటికే హస్తం పార్టీపై సెటైర్లు పేలుస్తూ ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ మరో కొత్త స్లోగన్ తెరపైకి తెచ్చింది. ధరణి తీసేసి ఆ స్థానంలో భూమాత పోర్టల్ తెస్తానంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడంపై కూడా ఇలాగే స్పందించింది. ధరణి కావాలా..? దరిద్రం కావాలా..? ఆలోచించుకోండి అంటూ ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో రోడ్ షో లో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. రైతన్నల భూమికి అన్ని విధాలా రక్షణ ఉండేలా తెచ్చిన ధరణి వ్యవస్థ కావాలా.. రైతుల భూములను ఇష్టారీతిన పరాధీనం చేసిన కాంగ్రెస్ తెస్తానంటున్న దరిద్రం కావాలా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎక్కడైనా 3గంటల కరెంటుతో 3 ఎకరాల పొలం పండించే రైతులు మీ వద్ద ఉన్నారా? అని ప్రశ్నించారు కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 గంటలే కరెంటు ఇస్తారని, 10హెచ్పీ మోటార్లంటూ రచ్చ చేస్తారని, రైతులు ఆలోచించుకోవాలని చెప్పారు. ధరణి తొలగించి మళ్లీ పటేల్, పట్వారీ, దళారీ వ్యవస్థలను ముందుకు తీసుకొస్తామని కాంగ్రెస్ నేతలు బాహాటంగా చెబుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ పగటి కలలు కంటోందని, వారు 20 సీట్లు కూడా దాటరని జోస్యం చెప్పారు. కరీంనగర్ లో చెల్లని రూపాయిలాంటి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లో ఎలా చెల్లుతారని విమర్శించారు కేటీఆర్.
కాంగ్రెస్ వస్తే అంధకారమే..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాజకీయ అస్థిరత ఉందని, అలాంటి గొడవల్ని కోరు కొనితెచ్చుకోవడం ఎందుకన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతుల్లో భద్రంగా ఉందని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ కే పట్టం కట్టాలన్నారు. సర్వేలన్నీ బీఆర్ఎస్ విజయం ఖాయం చేశాయని చెప్పారు కేటీఆర్. 82 స్థానాలతో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందన్నారు.
♦