త్రీడీ ప్రింటింగ్ ఇండస్ట్రీ హబ్ గా హైదరాబాద్..

హైదరాబాద్‌ లో ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, వైద్య పరికరాలు తదితర సదుపాయాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు మంత్రి కేటీఆర్. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని అన్నారు.

Advertisement
Update:2022-12-02 23:28 IST

రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ నగరం త్రీడీ ప్రింటింగ్ పరిశ్రమలకు హబ్‌ గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలో జరిగిన ఆమ్టెక్‌ ఎక్స్ పో లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం త్రీడీ ప్రింటింగ్‌, ఆవిష్కరణ రంగంపై ప్రధానంగా దృష్టి సారించిందని చెప్పారాయన. భారత్‌లో టెక్నాలజీని అభివృద్ధి చేసి విదేశాలకు అందించడానికి తాము కృషి చేస్తున్నామని అన్నారు.

ప్రస్తుతం త్రీడీ టెక్నాలజీ అన్ని రంగాల్లోనూ ఉపయోగపడుతోంది. మెడికల్, ఇండస్ట్రీ రంగాల్లోనూ త్రీడీ ప్రింటింగ్ చాలా పనులను సులభతరం చేసింది. సాంకేతికతతో ఎన్నో చిక్కుముడులను విప్పింది. త్రీడీ ప్రింటింగ్.. టెక్నాలజీలో ఓ అద్భుతం అని, అలాంటి అద్భుతాలకు హైదరాబాద్ వేదికగా మారుతోందని చెప్పారు మంత్రి కేటీఆర్. స్కైరూట్ ఏరోస్పేస్‌ సంస్థ త్రీడీ ప్రింటెడ్‌ ఇంజిన్‌ తో కూడిన ఓ ప్రైవేట్‌ రాకెట్‌ ను ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలో తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగించిన సంస్థగా స్కైరూట్ అరుదైన గుర్తింపు సాధించిందని చెప్పారు.

రాబోయే రెండు రోజుల్లో దేశ విదేశాలకు చెందిన 100కు పైగా పరిశ్రమలు, 50కి పైగా స్టార్టప్‌ లు, 15కు పైగా నేషనల్ రీసెర్చ్‌ డెవలప్‌ మెంట్ ఇన్‌ స్టిట్యూట్‌ లు, 3వేల మందికి పైగా ప్రతినిధులు ఈ ఆమ్టెక్ ఎక్స్ పో లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్‌ లో ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, వైద్య పరికరాలు తదితర సదుపాయాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు మంత్రి కేటీఆర్. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని అన్నారు. స్టార్టప్‌ లకు, నూతన ఆవిష్కరణలకు, పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రోత్సహం ఇస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ మద్దతు, సహకారంతో రాష్ట్రంలో టీ-హబ్, టీఎస్‌ఐసీ, వీ-హబ్‌, టాస్క్‌ వంటి స్టార్టప్‌ లతో సాంకేతిక వ్యవస్థ అభివృద్ధి చెందినదన్నారు. వివిధ పరిశ్రమలు, పరిశోధన సంస్థల నుంచి వచ్చిన ప్రతినిధులు.. తెలంగాణ ప్రభుత్వాన్ని తమ పారిశ్రామిక భాగస్వామిగా చేసుకోవాలని మంత్రి కోరారు. పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్రంలో మంచి అవకాశం ఉందని చెప్పారు కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News