ఆ ఆఫీస్ నాకు కనపడ్డానికి వీల్లేదు.. కూల్చేయండి

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్‌కు నోటీసులు జారీ చేసి ఆ నిర్మాణం తొలగించాలని సూచించారట మంత్రి కోమటిరెడ్డి.

Advertisement
Update:2024-08-04 11:28 IST

నల్లగొండలో బీఆర్ఎస్ కార్యాలయం ఇంకా ఎందుకు కూల్చేయలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్లగొండలో కౌన్సిల్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఆయన అధికారులకు మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 11న మరోసారి పర్యటనకు వస్తానని, ఆలోగా బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చేయాలన్నారు.

గతంలో ఓసారి నల్లగొండ పర్యటనకు వచ్చిన మంత్రి కోమటిరెడ్డి బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చేయాలని, ఆ స్థానంలో వాటర్‌ట్యాంక్‌, స్త్రీనిధి భవనం నిర్మాణానికి ప్లాన్‌ తయారు చేయాలని మున్సిపల్‌, ఇంజినీరింగ్‌ శాఖ అధికారులను ఆదేశించారు. అయితే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించలేమని తేల్చి చెప్పారు. తాజాగా కౌన్సిల్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి, మున్సిపల్ కమిషనర్ ని నిలదీశారు. ఆఫీస్ కూల్చివేత ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. ఆయన మౌనంగా ఉండటంతో.. అడిషనల్ కలెక్టర్ కి ఆ బాధ్యత అప్పగించారని తెలుస్తోంది. తాను అమెరికా పర్యటనకు వెళ్తున్నానని, తిరిగి వచ్చేలోగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉండటానికి లేదని ఆదేశించినట్టు చెబుతున్నారు.

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్‌కు నోటీసులు జారీ చేసి ఆ నిర్మాణం తొలగించాలని సూచించారట మంత్రి కోమటిరెడ్డి.ఒకవేళ కమిషనర్ స్పందించకపోతే.. ఆయనపై కేసు పెట్టి జైలుకి పంపించాలని కూడా స్థానిక నేతలకు సూచించారట. బీఆర్ఎస్ ఆఫీస్ విషయంలో మంత్రి చిందులు తొక్కిన వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Tags:    
Advertisement

Similar News