కంఠారెడ్డి ఇంటికి హరీష్ రావు.. మెదక్ లో కాంగ్రెస్ కి దెబ్బమీద దెబ్బ

కూకట్ పల్లిలోని వివేకానంద నగర్ లో కంఠారెడ్డి ఇంటికి మంత్రి హరీష్ రావు వెళ్లారు. ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికారు కంఠారెడ్డి కుటుంబ సభ్యులు. ఆయనను బీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించారు మంత్రి హరీష్ రావు.

Advertisement
Update:2023-10-06 08:23 IST

కాంగ్రెస్ పార్టీకి మైనంపల్లి హన్మంతరావు ప్లస్ కాదు, మైనస్ అని తేలిపోయింది. బీఆర్ఎస్ పై పగ సాధిద్దామనుకున్నారు కానీ.. పరోక్షంగా ఆ పార్టీకి మైనంపల్లి మేలు చేసి పెట్టారు. ఎన్నికల వేళ ఒకరు కాదు, ఇద్దరు కీలక నాయకుల్ని అప్పగించేశారు. మైనంపల్లి చేరికతో పార్టీకి రాజీనామా చేసిన రెండు జిల్లాల కాంగ్రెస్ ఆధ్యక్షులు బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన నందికంటి శ్రీధర్ కి అప్పుడే ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది. మెదక్ డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కంఠారెడ్డి తిరుపతి రెడ్డి తాజాగా బీఆర్ఎస్ కి దగ్గరయ్యారు. ఆయన ఇంటికి మంత్రి హరీష్ రావు వెళ్లి మంతనాలు జరిపారు.


మైనంపల్లికి మల్కాజ్ గిరి సీటు, ఆయన తనయుడికి మెదక్ టికెట్ ఖాయం చేయడంతో కంఠారెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కొన్నిరోజులుగా ఆయన సైలెంట్ గానే ఉన్నా బీఆర్ఎస్ వైపు అడుగులు పడతాయని అనుకున్నారు. నేడు అది నిజమైంది. కూకట్ పల్లిలోని వివేకానంద నగర్ లో కంఠారెడ్డి ఇంటికి మంత్రి హరీష్ రావు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు కంఠారెడ్డి కుటుంబ సభ్యులు. ఆయనను బీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించారు మంత్రి హరీష్ రావు.

మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే ఈసారి కూడా బీఆర్ఎస్ టికెట్ ఖరారు చేసింది. ఈ సీటు తన కొడుక్కి కావాలంటున్న మైనంపల్లి తనకి మల్కాజ్ గిరి టికెట్ ఇచ్చినా కూడా అలిగి కాంగ్రెస్ లోకి వెళ్లారు. తాను అనుకున్నట్టుగా రెండు సీట్లు సాధించారు కానీ, ఆ రెండు సీట్లలో గెలుపు అవకాశాలు మాత్రం ఆయనకు తగ్గిపోతున్నాయి. మైనంపల్లికి కాంగ్రెస్ నేతలు దగ్గర కాలేకపోతున్నారు. మెదక్ లో కంఠారెడ్డి బీఆర్ఎస్ వైపు వెళ్తుండటంతో.. అక్కడ పద్మా దేవేందర్ రెడ్డి విజయం మరింత సునాయాసం అవుతుంది. మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న మైనంపల్లి రోహిత్ కి తొలి ఎన్నికే అగ్నిపరీక్షగా మారింది. 

Tags:    
Advertisement

Similar News