కార్యకర్తల సేవలు వెలకట్టలేనివి..
ప్రజా క్షేత్రంలో ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధం కలిగి ఉండి, అంకితభావంతో కార్యకర్తలు పడిన కష్టం, తపన.. తనతో పాటు అందరికీ స్ఫూర్తిదాయకం అని కితాబిచ్చారు హరీష్ రావు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుకోసం కష్టపడిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు మంత్రి హరీష్ రావు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం దాదాపు 100 రోజులపాటు ఎంతో శ్రమించిన కార్యకర్తల సేవలు వెలకట్టలేనివి అని అన్నారు. ప్రజా క్షేత్రంలో ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధం కలిగి ఉండి, అంకితభావంతో కార్యకర్తలు పడిన కష్టం, తపన.. తనతో పాటు అందరికీ స్ఫూర్తిదాయకం అని కితాబిచ్చారు హరీష్ రావు.
ఎగ్జిట్ పోల్స్ పై స్పందించని హరీష్ రావు..
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ హాట్ టాపిక్ గా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసుకుని కాంగ్రెస్ నేతలు విజయం తమదేనంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తిరగరాసిన చరిత్ర తమది అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు మాత్రం ఎక్కడా ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రస్తావించలేదు. ఆ మాటకొస్తే.. పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా ఆయన ఎక్కడా మీడియాతో మాట్లాడలేదు. ఈరోజు కార్యకర్తల కష్టాన్ని అభినందిస్తూ హరీష్ రావు ట్వీట్ వేశారు.
హరీష్ తన రికార్డ్ తానే బ్రేక్ చేస్తారా..?
మంత్రి హరీష్ రావు మెజార్టీ విషయంలో తన రికార్డ్ తానే తిరగరాస్తారనే అంచనాలున్నాయి. 2004 ఉప ఎన్నికలనుంచి హరీష్ రావు సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో ఆయనకు 93,328 ఓట్ల మెజార్టీ వచ్చింది. 2018 నాటికి మెజార్టీ 1,18,699 కి చేరుకుంది. రికార్డ్ మెజార్టీతో హరీష్ రావు ప్రత్యర్థులను చిత్తుచేశారు. ఈసారి కూడా ఆయన మెజార్టీ మరింత పెరుగుతుందనే అంచనాలున్నాయి.