గాంధీలో మదర్ అండ్ చైల్డ్ కేర్.. రేపే ప్రారంభం

రూ.60 కోట్లతో గాంధీ ఆస్పత్రిలో MCH ని అందుబాటులోకి తెస్తున్నారు. రూ.52 కోట్ల వ్యయంతో 200 పడకల సామర్ధ్యంతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి భవనం నిర్మించారు. రూ.8 కోట్లతో అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులో ఉంచారు.

Advertisement
Update:2023-08-19 08:50 IST

తెలంగాణ ఏర్పాటైన తర్వాత వైద్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. నూతన పథకాలు, వసతుల కల్పనతో.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి, తల్లిబిడ్డల సంరక్షణ మరింత మెరుగైంది. మాతా శిశు మరణాల సంఖ్య బాగా తగ్గిపోయింది. అక్కడితో ప్రభుత్వం సరిపెట్టుకోలేదు, ఆ గణాంకాలు చూసి సంతృప్తి పడలేదు. గర్భిణులు, చిన్నారులు, బాలింతలకోసం అత్యాధునిక వసతులతో హైదరాబాద్ లో మూడు ఆస్పత్రుల నిర్మాణం ప్రారంభించింది. మదర్ అండ్ చైల్డ్ కేర్ (MCH) సెంటర్ల పేరుతో వీటిని అందుబాటులోకి తెస్తోంది. గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన MCH సెంటర్ ని రేపు (ఆగస్ట్-20) మంత్రి హరీష్ రావు ప్రారంభిస్తారు.

గ్రేటర్ పరిధిలో మొత్తం 3 MCH లు అందుబాటులోకి రాబోతున్నాయి. నిమ్స్ ఆస్పత్రిలో ఒకటి ఏర్పాటవుతోంది, ఆల్వాల్ లో నిర్మిస్తున్న టిమ్స్ పరిధిలో రెండోది నిర్మిస్తున్నారు. మూడోది గాంధీ ఆస్పత్రిలోని MCH. ఈ ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి. తల్లులు, బిడ్డలకు సంబంధించి అన్ని రకాల మల్టిపుల్ వైద్య సేవలు ఇక్కడ లభిస్తాయి. ప్రసవ సమయంలో మరణాలను మరింత కనిష్ట స్థాయికి చేర్చేందుకు ఈ ఆస్పత్రులు ఉపయోగపడే విధంగా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు.

గాంధీ MCH ప్రత్యేకతలు..

రూ.60 కోట్లతో గాంధీ ఆస్పత్రిలోని MCH ని అందుబాటులోకి తెస్తున్నారు. రూ.52 కోట్ల వ్యయంతో 200 పడకల సామర్ధ్యంతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి భవనం నిర్మించారు. రూ.8 కోట్లతో అత్యాధునిక వైద్య పరికరాలను ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఈ భవనంలో 8 అంతస్తులుంటాయి. గుండె, కిడ్నీ, లివర్, న్యూరో తదితర మల్టిపుల్‌ వ్యాధులతో బాధపడే తల్లులకు, పుట్టుకతోనే వచ్చే వివిధ రకాల సమస్యలతో బాధపడే శిశువులకు ఈ ‘మదర్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌’ సెంటర్‌ లో సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందుతుంది.

అరుదైన సందర్భాల్లో గర్భిణులకు డయాలసిస్‌ అవసరమవుతుంది. అలాంటి సమయాల్లో ఉపయోగపడేందుకు ఇక్కడే డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తల్లుల కోసం 22 వెంటిలేటర్లు, పిల్లల కోసం 24 వెంటిలేటర్లు, వామర్లు, గుండె పరీక్షల కోసం 2డి-ఎకో యంత్రాలు, ల్యాపరోస్కోపి.. తదితర యంత్రాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. గర్భిణులు, ప్రసవించిన తల్లుల కోసం మదర్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌(MICU), పిల్లలకోసం NICU, SNCU, మదర్ మిల్క్ బ్యాంక్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News