10గంటలకు 10నిమిషాలు..
వర్షాకాలం దోమల కారణంగా డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని, వ్యాధులు వచ్చిన తర్వాత ఇబ్బంది పడటం కంటే ముందు జాగ్రత్తలు మేలు అని చెప్పారు మంత్రి హరీష్ రావు.
వర్షాకాలం వచ్చింది, అపరిశుభ్ర వాతావరణంతో అనారోగ్యాల ముప్పు పొంచి ఉంది. ఎవరి ఆరోగ్యం పట్ల వారు శ్రద్ధ వహించడంతోపాటు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలని, అందుకే ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు మంత్రి హరీష్ రావు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు తానే ముందుకొచ్చారు. తన ఇంటి పరిసరాలను శుభ్రం చేశారు. నిల్వ ఉన్న నీటిని పారబోశారు. తెలంగాణ ప్రజలు కూడా వారానికి ఓసారి ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఆదివారం 10గంటలకు..
వారానికోరోజు ఆదివారం ఉదయం 10 గంటలకు 10నిమిషాల సమయాన్ని తమకోసం తాము కేటాయించుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు. 10నిమిషాల సమయం చూసుకుని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా మార్చుకోవాలని, నిల్వ ఉన్న నీటిని పారబోయాలన్నారు. తాను చెప్పింది ఆచరణలో చేసి చూపించారు. కోకాపేటలోని తన నివాసంలో పరిసరాల పరిశుభ్రతకు 10 నిమిషాల సమయం కేటాయించారు. ఇంటి పరిసరాలలో నిల్వ ఉండే నీరు స్వయంగా తొలగించి చెత్తను శుభ్రం చేశారు.
వర్షాకాలం దోమల కారణంగా డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని, వ్యాధులు వచ్చిన తర్వాత ఇబ్బంది పడటం కంటే ముందు జాగ్రత్తలు మేలు అని చెప్పారు మంత్రి హరీష్ రావు. దోమల నివారణకు అందరూ కృషి చేయాలని సూచించారు. పరిశుభ్రమైన పరిసరాలతోపాటు పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ, గ్రామ పంచాయతీల్లోని సిబ్బంది వీధులను శుభ్రం చేస్తున్నా.. మన ఇంటి పరిసరాలను మనం శుభ్రం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టి-డయాగ్నోస్టిక్స్ ద్వారా ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అనారోగ్యానికి గురైతే ప్రభుత్వ ఆస్పత్రులను సంప్రదించాలని సూచించారు.