హుజూరాబాద్ లో ఇకపై జీ హుజూర్ రాజకీయాలుండవు
ఈటలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి హరీష్ రావు. హుజూరాబాద్ తోపాటు, గజ్వేల్ లో కూడా నామినేషన్ వేసిన ఈటల పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడి అయిందని అన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇకనుండి జీ హుజూర్ రాజకీయాలు నడవవని అన్నారు మంత్రి హరీష్ రావు. జమ్మికుంటలో నిర్వహించిన రోడ్ షో లో ఆయన స్థానిక అభ్యర్థి కౌశిక్ రెడ్డితో కలసి పాల్గొన్నారు. సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయని, ఈసారి గెలుపు ఆయనదేనని చెప్పారు. ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల, నియోజకవర్గంలో తట్టెడు మట్టిపోసిన పాపాన పోలేదన్నారు.
టార్గెట్ ఈటల..
ఈటలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి హరీష్ రావు. హుజూరాబాద్ తోపాటు, గజ్వేల్ లో కూడా నామినేషన్ వేసిన ఈటల పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడి అయిందని అన్నారు. పెద్దాయనపై పోటీ చేసినంత మాత్రాన పెద్దవారు కారని, గజ్వేల్ లో సీఎం కేసీఆర్ లక్ష మెజారిటీతో గెలుస్తారన్నారు. హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి భారీ మెజార్టీతో ఈటలను మట్టికరిపిస్తారని చెప్పారు. ఏడుసార్లు ఈటలకు అవకాశం ఇచ్చిన ప్రజలు, ఈ ఒక్కసారి కౌశిక్ రెడ్డిని గెలిపించాలని, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పారు. పదవుల కోసం ఈటల రాజేందర్ తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని, సమైక్యవాదులైన కిరణ్ కుమార్ రెడ్డి, పవన్ కళ్యాణ్ తో ఆయన జతకట్టాడని విమర్శించారు.
కాంగ్రెస్ పరిస్థితి అలా..
కాంగ్రెస్ పార్టీలో నిన్న టికెట్ ఇచ్చి ఈరోజు గుంజుకున్నారని, పొద్దున టికెట్ ఖరారు చేసి, సాయంత్రం వేరేవారికి బీఫామ్ ఇచ్చారని.. ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. ఆ పార్టీలో నాయకుల టికెట్లకే గ్యారెంటీ లేదని ఇక ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలకు గ్యారంటీ ఎక్కడిదని ప్రశ్నించారు.