ఢిల్లీ కాలుష్యం.. ఇంకో మూడు రోజులు తప్పదు

కాంగ్రెస్‌ వస్తే.. మళ్లీ స్కామ్‌ లు తప్పవని అన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ కి ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ కరెంట్‌ కోతలు ఉంటాయని హెచ్చరించారు.

Advertisement
Update:2023-11-26 20:46 IST

తెలంగాణ ఎన్నికల వేళ.. ఢిల్లీ నేతలు ఇక్కడికి వచ్చి కాలుష్యాన్ని సృష్టిస్తున్నారని సెటైర్లు పేల్చారు మంత్రి హరీష్ రావు. ఈ ఢిల్లీ కాలుష్యం ఇంకో మూడు రోజులు తప్పదని హెచ్చరించారు. ఎన్నికల తర్వాత మళ్లీ వీళ్లెవరూ ఇక్కడ కనపడరని అన్నారు. ఢిల్లీ కాలుష్యాన్ని ఇంకో మూడు రోజులు భరించాలన్నారు హరీష్. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని మణికొండలో ఆయన ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ కి భారీ మెజార్టీ రావాలని ఆకాంక్షించారు.


తెలంగాణలో అప్పుడు.. ఇప్పుడు..

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఎలా ఉంది.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎలా అభివృద్ధి చెందింది.. అనే విషయాలను వివరించారు మంత్రి హరీష్ రావు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు.. అనే పాటలు ఉండేవని, ఇప్పుడు నేను వెళ్తా బిడ్డో... సర్కార్‌ దవాఖానాకు అని పాడుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్‌ ఎంత అభివృద్ధి చెందిందో మీరే చూస్తున్నారని అన్నారు హరీష్ రావు. మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తే పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలందరూ ఆలోచించి సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ వస్తే.. మళ్లీ స్కామ్‌ లు తప్పవని అన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ కి ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ కరెంట్‌ కోతలు ఉంటాయని హెచ్చరించారు. కాంగ్రెస్ వస్తే ప్రభుత్వంలో స్థిరత్వం ఉండదని, ఆరు నెలలకో సీఎం గ్యారెంటీ అని, ఇక ఆరు గ్యారెంటీలకు దిక్కెక్కడిదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాలేమని తెలిసి బీసీ సీఎం అంటూ బీజేపీ కొత్త పల్లవి అందుకుందని, ఆ పార్టీకి ఈసారి సింగిల్ సీటు కూడా కష్టమేనని చెప్పారు. ఢిల్లీ పెద్దలంతా వచ్చి బీజేపీ తరపున ప్రచారం చేసినా ఫలితం లేదన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ విజయం ఖాయమని ఈపాటికే తేలిపోయిందన్నారు.


Tags:    
Advertisement

Similar News