వైరల్ ఫీవర్లు, కళ్ల కలక.. తెలంగాణ ఆరోగ్య శాఖ సన్నద్ధత

కళ్ల కలక ఇన్ఫెక్షన్‌ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు మంత్రి హరీష్ రావు. కళ్ల కలక చికిత్సలో వినియోగించే మందులను అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచామని చెప్పారు.

Advertisement
Update:2023-08-02 10:52 IST

దేశవ్యాప్తంగా కళ్ల కలక కేసులు పెరుగుతున్నాయి. ముందు జాగ్రత్తలు, వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ సోషల్ మీడియాలో డాక్టర్ల సూచనలు, సలహాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ఇక వాట్సప్ యూనివర్శిటీలో ఫార్వార్డ్ మెసేజ్ లకు కొదవే లేదు. ఈ సమాచారం వల్ల అవగాహన పెరిగితే పర్లేదు కానీ, లేనిపోని భయాలు మొదలైతే మాత్రం ఇబ్బందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కళ్లకలక విషయంలో ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. వర్షాల తర్వాత వైరల్ ఫీవర్లు కూడా పెరిగే అవకాశం ఉండటంతో.. రాష్ట్ర వైద్యశాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు.


కళ్ల కలక ఇన్ఫెక్షన్‌ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దానివల్ల ప్రమాదమేమీ లేదని చెప్పారు మంత్రి హరీష్ రావు. కళ్ల కలక చికిత్సలో వినియోగించే చుక్కల మందు, ఆయింట్ మెంట్ లు, అవసరమైన మందులను పీహెచ్‌సీ, బస్తీ దవాఖాన, పల్లె దవాఖానల స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన మంత్రి.. కళ్ల కలక, సీజనల్‌వ్యాధుల అప్రమత్తతపై చర్చించారు. కళ్ల కలక ఇన్ఫెక్షన్‌ వ్యాప్తి నివారణ చర్యలు, చికిత్స తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

కళ్ల కలక సోకినవారిని ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు గుర్తించి సమీప ఆస్పత్రుల్లో చికిత్స అందేలా చూడాలన్నారు మంత్రి హరీష్ రావు. గురుకులాలు, హాస్టళ్లలో పరిశుభ్రత గురించి అవగాహన పెంచాలని చెప్పారు. ఇన్ఫెక్షన్‌ సోకినవారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తరుచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వారు వాడిన వస్తువులు ఇతరులు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవడం చేయాలన్నారు. సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఓపీ వేళలు పెంచాలని సూపరింటెండెంట్‌ కు సూచించారు మంత్రి హరీష్ రావు.

Tags:    
Advertisement

Similar News