సీపీఆర్ చేసి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్ కు మంత్రి హరీష్ రావు ప్రశంసలు
అలా చాలాసేపు సీపీఆర్ చేసిన తర్వాత బాలరాజు స్పృహలోకి వచ్చాడు. ఆ తర్వాత అతడిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం బాలరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు.
హైదరాబాద్ లో నడిరోడ్డుపై గుండెపోటు వచ్చి ఓ వ్యక్తి కుప్పకూలిపోగా ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ సమయానికి స్పందించి బాధితుడికి సీపీఆర్ చేసి ఆ వ్యక్తి ప్రాణాన్ని కాపాడాడు. ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా మంత్రి హరీష్ రావు కూడా ఈ ఘటనపై స్పందించి ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసిన పనిని మెచ్చుకున్నారు. అతడు ఎంతో గొప్ప పని చేశాడని ప్రశంసించారు.
రాజేంద్రనగర్ పరిధి ఆరంఘర్ లో ఇవాళ ఉదయం అటుగా వెళుతున్న బాలరాజు అనే వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ముందు అతడు ఫిట్స్ వచ్చి పడిపోయాడేమో అని అంతా భావించారు. ఆ తర్వాత అక్కడికి ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ వచ్చాడు. చలనం లేకుండా పడి ఉన్న వ్యక్తిని చూశాడు. అతడు గుండెపోటు తోనే కుప్పకూలి ఉంటాడని భావించాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సీపీఆర్ చేశాడు. చాలాసేపు బాలరాజు స్పృహలోకి రాకున్నప్పటికీ తనకెందుకులే అని వదిలేయకుండా సీపీఆర్ కొనసాగించాడు.
అలా చాలాసేపు సీపీఆర్ చేసిన తర్వాత బాలరాజు స్పృహలోకి వచ్చాడు. ఆ తర్వాత అతడిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం బాలరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. దీంతో సమయానికి స్పందించి రోడ్డుపై పడి ఉన్న వ్యక్తికి సీపీఆర్ చేసిన అతడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ ను పలువురు ప్రశంసించారు.
రాజశేఖర్ చేసిన పనిని మంత్రి హరీష్ రావు కూడా మెచ్చుకున్నారు. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకొని ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. 'రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ రాజశేఖర్ చేసిన పనిని ప్రశంసించి తీరాల్సిందే. సీపీఆర్ చేసి మనిషి ప్రాణాలు కాపాడడం ఎంతో గొప్ప విషయం. గుండెపోట్లు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చేవారం ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఉద్యోగులకు ప్రభుత్వం సీపీఆర్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించనుంది.' అని మంత్రి ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో యువతకు కూడా గుండెపోటు వస్తున్న క్రమంలో మంత్రి హరీష్ రావు తీసుకున్న నిర్ణయంపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి.