మంత్రాలతో కాదు.. ఉద్యమాలతో అధికారంలోకి వచ్చాం.. బీజేపీకి హరీష్ రావు కౌంటర్
టీఆర్ఎస్ నేతలు తాంత్రిక పూజలు చేస్తున్నారని బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తాంత్రిక పూజలు చేసినట్లు సాక్ష్యాలు చూపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
తాంత్రికుడి సూచన మేరకే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చారని నిన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాంత్రికుడి మాటలు విని కేసీఆర్ సచివాలయానికి కూడా వెళ్లడం లేదని, మూడు నెలలకు ఒకసారి నల్ల పిల్లితో పూజలు చేయిస్తున్నారని విమర్శించారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కేసీఆర్ పై ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. మహిళలను మంత్రివర్గంలో పెట్టుకుంటే మంచిది కాదని తాంత్రికుడు చెప్పడంతోనే కేసీఆర్ మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని ఆమె ఆరోపించారు. మంత్రాలు, తంత్రాలు అంటూ కేసీఆర్ సచివాలయానికి వెళ్లడం లేదని విమర్శలు చేశారు. బీజేపీ నేతలు చేసిన విమర్శలపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ స్పందించగా.. తాజాగా మరో మంత్రి హరీష్ రావు స్పందించారు.
టీఆర్ఎస్ నేతలు తాంత్రిక పూజలు చేస్తున్నారని బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తాంత్రిక పూజలు చేసినట్లు సాక్ష్యాలు చూపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఏం చెప్పాలో అర్థం కాక బీజేపీ నేతలు టీఆర్ఎస్ పై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. క్షుద్ర పూజలు చేస్తున్నామని, మంత్ర, తంత్రాలు చేస్తున్నామని అంటున్నారు. కేంద్ర మంత్రి కూడా దిగజారుడు రాజకీయాలకు దిగుతున్నారు. బీజేపీ నాయకులు తెలంగాణకు ప్రజాస్వామ్య బద్ధంగా ఏం చేశారో చెప్పాలి. ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడవద్దు.
మేమేమన్న మంత్ర, తంత్ర విద్యలతో అధికారంలోకి వచ్చామా.. ప్రజా ఉద్యమాల ద్వారా.. రాష్ట్రాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన పార్టీ టీఆర్ఎస్. మతం, కులం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే అలవాటు ఉన్న పార్టీ బీజేపీ.' అని మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.