కాంగ్రెస్ కి ఓటేస్తే ఊరిలో ఇద్దరికే మేలు.. బీఆర్ఎస్ కి వేస్తే ఊరంతా మేలు
రాబోయే ప్రభుత్వంలో మరోసారి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి చేపట్టాలని ఉందని, ప్రజలకు ఎక్కువ సేవ చేసే అవకాశం ఆత్మసంతృప్తి ఆ శాఖలోనే ఉందన్నారు హరీష్ రావు.
"ఊరికి ఇద్దరు పైరవీకారులకు మేలు కలగాలంటే కాంగ్రెస్ పార్టీకు ఓటేయండి.. ఊరంతా మేలు జరగాలి అంటే బీఆర్ఎస్ కు ఓటేయండి" అని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్ధిపేటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ తమ మేనిఫెస్టోని కాపీ కొట్టిందన్నారు హరీష్ రావు. తమ పథకాలకు కొంత కలిపి ఎక్కువ ఇస్తామని చెప్పిందని, కాంగ్రెస్ పార్టీది ఎగవేసే చరిత్ర అని, బీఆర్ఎస్ ది హామీలను నెరవేర్చిన ఘనత అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కర్నాటకలో ఎన్నికల హామీ ఇచ్చిన రాహుల్ ఇప్పుడు సమాధానం చెప్పడంలేదన్నారు. రాబోయే ప్రభుత్వంలో మరోసారి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి చేపట్టాలని ఉందని, ప్రజలకు ఎక్కువ సేవ చేసే అవకాశం ఆత్మసంతృప్తి ఆ శాఖలోనే ఉందన్నారు హరీష్ రావు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ కు సరితూగే నాయకడు లేడన్నారు హరీష్ రావు. విద్య, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయని చెప్పారాయన. మళ్లీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య, విద్య రంగాలను మరింత బలోపేతం చేయడంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు. కులం, మతం, ప్రాంత వివక్ష తెలంగాణలో లేదన్నారు. వాటర్ ట్యాంకర్లు, జనరేటర్ల చప్పుళ్లు లేనే లేవన్నారు హరీష్ రావు.
ఎప్పటికీ ఒకటి కాదు..
మైనార్టీల ఓట్ల కోసమే బీర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు హరీష్ రావు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అయితే గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేవారు కదా అని ప్రశ్నించారు. ఆర్టీసీ బిల్లు అంతా సిద్ధంగా ఉంటే గవర్నర్ ఎందుకు కొర్రీలు పెట్టారని అడిగారు హరీష్. ఇప్పుడైనా ఈసీ ఒప్పుకుంటే ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేస్తామని, లేకపోతే మళ్లీ ప్రభుత్వం ఏర్పడగానే విలీనం చేస్తామన్నారు. బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టలేదని కేంద్ర ప్రభుత్వం 35 వేల కోట్ల రూపాయలు కోత వేసిందని, బీజేపీపై తాము పోరాటం చేస్తున్నందుకే, కేంద్రం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు హరీష్ రావు.