అందరూ మనవాళ్లే, ఉండేది మన ప్రభుత్వమే..
లంచం, మిత్తి, అప్పు అనేవాటికి తావు లేకుండా గృహలక్ష్మి పథకం అమలవుతోందని చెప్పారు మంత్రి హరీష్ రావు. లబ్ధిదారుల్ని ఎవరూ డబ్బులు అడగరని, ఎవరైనా అడిగితే తనకు చెప్పాలన్నారు.
తెలంగాణలో సంక్షేమ పథకాలు అందడంలేదని ఎవరూ మనసు కష్టపెట్టుకోవద్దని.. అందరూ మనవాళ్లే, ఉండేది మన ప్రభుత్వమేనని ధైర్యం చెప్పారు మంత్రి హరీష్ రావు. పైరవీలకు తావు లేకుండా గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారాయన. సిద్దిపేట కొండ మల్లయ్య గార్డెన్స్ లో గృహలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. గృహలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.3లక్షల ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పారు. అందరికీ ఒకేసారి ఇవ్వడం ఇబ్బందని, ముందు వెనక అయినా అందరికీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఉండేది మన ప్రభుత్వమే, సీఎం మన కేసీఆరేననే విషయం గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో లంచాలు ఇచ్చినా పేదలకు ఇళ్లు దక్కలేదని, తిరిగి తిరిగి కాళ్లు అరిగేవన్నారు హరీష్ రావు. తమ ప్రభుత్వంలో మధ్యవర్తులు లేకుండా పైరవీలు లేకుండా నేరుగా ఖాతాల్లోనే గృహలక్ష్మి డబ్బులు జమచేస్తున్నామని చెప్పారు.
లంచం అడిగితే ఫిర్యాదు చేయండి..
లంచం, మిత్తి, అప్పు అనేవాటికి తావు లేకుండా గృహలక్ష్మి పథకం అమలవుతోందని చెప్పారు మంత్రి హరీష్ రావు. లబ్ధిదారుల్ని ఎవరూ డబ్బులు అడగరని, ఎవరైనా అడిగితే తనకు చెప్పాలన్నారు. పంచాయతి సెక్రెటరీ, సర్పంచ్.. అందరూ ప్రజలకు అందుబాటులో ఉండి డబ్బులు వచ్చేలా చేస్తారన్నారు. గృహలక్ష్మి పథకంలో డబ్బులు తీసుకుని కూాడా రెండు నెలల వరకు ఎలాంటి పని మొదలు పెట్టకపోతే, వారి స్థానంలో మరొకరిని ఎంపిక చేస్తామన్నారు మంత్రి.
ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ.. తిట్టడంలో పోటీపడుతున్నాయని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. పని చేసిన ప్రభుత్వం వైపు ఉంటారా..? గోబెల్స్, అబద్ధాలు ప్రచారం చేసే వారి వెంట ఉంటారా? ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. సద్ది తిన్న రేవు తలవాలని, సహాయం చేసిన వారిని మరవొద్దని చెప్పారు. సిద్ధిపేటలో పద్మశాలి, ఎస్సీ కమ్యూనిటీ హాళ్ల ప్రారంభోత్సవాలు, ఆసరా పింఛన్ల పంపిణీ, కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.
♦