ప్రకృతి వైద్యానికి తెలంగాణను కేరాఫ్ అడ్రస్ చేస్తాం..

వైద్య రంగంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ, ఆయుష్ చికిత్సల్లో కూడా అగ్రస్థానంలో ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని చెప్పారు హరీష్ రావు.

Advertisement
Update:2023-06-25 19:16 IST

ప్రకృతి వైద్యానికి తెలంగాణను కేరాఫ్ అడ్రస్‌ గా నిలిపేలా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు మంత్రి హరీష్ రావు. సనాతన భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో 834 ఆయుష్ డిస్పెన్సరీలు, ఐదు కాలేజీలు, నాలుగు రీసెర్చ్ హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పారు. వికారాబాద్, భూపాలపల్లి, సిద్ధిపేటలో 50 పడకల కొత్త ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. అన్ని రంగాలకు హైదరాబాద్ హబ్ గా మారిందని, తాజాగా ఆయుర్వేదానికి కూడా హైదరాబాద్ హబ్ అవుతోందన్నారు హరీష్ రావు. వైద్య రంగంలో నీతి అయోగ్ ఇండెక్స్‌ లో 2014లో తెలంగాణ 11వ స్థానంలో ఉంటే.. ఇప్పుడు మూడో స్థానానికి చేరుకుందని వివరించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కన్వెన్షన్‌ హాలులో విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన కృతజ్ఞత సభలో మంత్రి పాల్గొన్నారు.

ఆయుర్వేద వైద్యులకు హెల్త్ అండ్ వెల్‌ నెస్‌ సెంటర్లలో సేవలు అందించే గొప్ప అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని గుర్తు చేశారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొత్తం 1154 మందికి MLHPగా అవకాశం కల్పించామని చెప్పారు. కరోనా సమయంలో ప్రపంచమంతా తలకిందులైతే.. ఆయుర్వేదం ఒక్కటే భరోసానిచ్చిందని, సంప్రదాయ వైద్యమే మందు అని ఎంతో మంది నమ్మి ఆచరించి.. ప్రాణాలు కాపాడుకున్నారన్నారు హరీష్ రావు. ఆయుర్వేద ఫార్మసీ ద్వారా తయారు చేసిన జీవన్ ధార ఔషధాన్ని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిందని, సీఎం కేసీఆర్‌ సహా అందరూ జీవన్ ధార ఔషధాలను వాడారన్నారు. కరోనా సెకండ్ వేవ్‌ సమయంలో బ్లాక్ ఫంగస్ వ్యాధి ప్రపంచాన్ని భయపెట్టిందని, మందులు కూడా లేని సమయంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయుర్వేద కళాశాల వైద్య బృందం ఎంతో పరిశోధించి బ్లాక్ ఫంగస్‌ కు మందుని కనిపెట్టిందన్నారు.

రెండు దఫాలుగా జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో మంచి సేవలందించారంటూ ఆయుర్వేద వైద్యులను అభినందించారు హరీష్ రావు. వైద్య రంగంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ ఆయుష్ చికిత్సల్లో కూడా అగ్రస్థానంలో ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. ప్రకృతి వైద్యం కోసం ఎంతో మంది ప్రైవేటుకు వెళ్లి రూ.లక్షలు ఖర్చు చేసుకుంటున్నారని, అలాంటి వారికి అతి తక్కువ ఖర్చుకే ఉత్తమ వైద్యం అందించేందుకు నేచర్ క్యూర్ ఆసుపత్రిని రూ.10 కోట్లతో అందంగా, ఆకర్షణీయంగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. 

Tags:    
Advertisement

Similar News