కొత్త రేషన్ కార్డులంటూ తప్పుడు ప్రచారం.. ఎవరూ నమ్మొద్దు
ఈనెల 21 నుంచి కొత్త రేషను కార్డులు ఇవ్వడానికి అప్లికేషన్లు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోందని, దాన్ని ఎవరూ నమ్మొద్దని మంత్రి ఓ ప్రకటనలో కోరారు.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ మొదలైందంటూ గత నాలుగైదురోజులుగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇదిగో ఇదే కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ ఫాం అంటూ ఓ దరఖాస్తు ఫారమ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈనెల 21 నుంచే అప్లికేషన్లు తీసుకుంటారన్నది ఆ ప్రచారం సారాంశం. అయితే ఈ ప్రచారాన్ని నమ్మొద్దంటూ తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ క్లారిటీ ఇచ్చారు.
ఈనెల 21 నుంచి కొత్త రేషను కార్డులు ఇవ్వడానికి అప్లికేషన్లు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోందని, దాన్ని ఎవరూ నమ్మొద్దని మంత్రి ఓ ప్రకటనలో కోరారు. వాట్సాప్ గ్రూప్‌ల్లో ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను గందరగోళానికి గురి చేయవద్దని ఆయన సూచించారు.
ఎప్పుడిస్తారు మరి?
తెలంగాణలో రేషను కార్డుల జారీ ఆపేసి చాలాకాలమైపోయింది. ఆరోగ్యశ్రీ నుంచి డబుల్ బెడ్‌రూం ఇండ్ల వరకు పేదలకు ఏ కార్యక్రమం అందాలన్నా రేషను కార్డే ఓ ప్రాతిపదికగా ఉంటూ వస్తోంది. అందువల్ల చాలామంది పేదలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వలస కూలీలు రేషను కార్డుల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 21 నుంచి కొత్త కార్డుల జారీ మొదలవుతుందంటే ఆశపడిన పేదలు.. ఇప్పుడు మంత్రి ప్రకటనతో డీలా పడిపోయారు. కొత్త కార్డులు ఎప్పటి నుంచో ఇస్తారోనని నిట్టూరుస్తున్నారు.