ఎల్లారెడ్డిపై ఎర్రబెల్లి అల్లుడి చూపు..! టీఆర్‌ఎస్‌ పాత కాపుకు ఛాన్స్‌ ఇస్తుందా..?

Advertisement
Update:2022-07-20 08:20 IST

తెలంగాణలో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదికిపైగానే టైమ్‌ ఉంది. కానీ అప్పుడే నియోజకవర్గాలపై నేతలు కర్చీప్‌ వేయడం మొదలెట్టారు. పాత నిజామాబాద్‌ జిల్లాలో కీలకమైన ఎల్లారెడ్డి నియోజకవర్గంపై ఇప్పుడు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అల్లుడు మదన్‌ మోహన్‌ రావు చూపు పడింది. ప్రస్తుతం ఈయన రాష్ట్ర కాంగ్రెస్‌ ఐటీ సెల్‌ ఛైర్మన్‌.

ఎర్రబెల్లికి మదన్‌ మోహన్‌ అల్లుడు. కానీ మామ బాటలో అల్లుడు నడవడం లేదు. కాంగ్రెస్‌లో కొనసాగుతున్న మదన్‌మోహన్‌.. గత ఎన్నికల్లో జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఆరువేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బీబీ పాటిల్‌కు 4 లక్షల 34 వేల 244 ఓట్లు వస్తే.. మదన్‌ మోహన్‌కు 4 లక్షల 28వేల 15 ఓట్లు వచ్చాయి. స్వల్ప తేడాతో ఓడిపోవడంతో మదన్‌ మోహన్‌కు కాంగ్రెస్‌లో పట్టు పెరిగింది.

జహీరాబాద్‌ పార్లమెంట్‌ నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకు మదన్‌ రెడీగా లేరని తెలుస్తోంది. అందుకే ఈ సెగ్మెంట్‌ పరిధిలోనే ఎల్లారెడ్డి నియోజకవర్గంపై ఆయన ఫోకస్ పెట్టారు. ఇక్కడే వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ఆయనకు రేవంత్ అనుచరుడు సుభాష్‌ రెడ్డితో వర్గపోరు మొదలైంది. ఇద్దరు నేతల గ్రూప్‌ ఫైట్‌ కార్యకర్తలు కూడా రెండు గ్రూపులుగా విడిపోయారు. అయితే సర్వేలో తనకే మొగ్గు వస్తే టికెట్‌ దక్కడం ఖాయమని మదన్‌ ధీమాగా ఉంది. అందుకే కరోనా టైమ్‌ నుంచి ఎల్లారెడ్డిలో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్‌లో గెలిచి టీఆర్‌ఎస్‌లోకి మారిన జాజుల సురేందర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే. వరుస ఓటములతో ఈయనకు సింపతీ కలిసి వచ్చి గత ఎన్నికల్లో గెలిచారు. కానీ ఇప్పుడు ఈయన మరోసారి గెలిచే అవకాశం లేనేది నియోజకవర్గంలో టాక్‌. వరుస సర్వేల్లో ర్యాంక్‌ పడిపోవడమే కానీ.. గ్రాఫ్‌ పెరగడం లేదట. వచ్చే నెలలో జరిగే మూడు సర్వేల తర్వాత ఈ గ్రాఫ్‌ పెరగకపోతే టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.

ఎల్లారెడ్డిపై మదన్‌ మోహన్‌ ఫోకస్‌ పెట్టడానికి రెండు కారణాలు కన్పిస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌ బలంగా ఉంది. మరోవైపు ఇక్కడ వాళ్ల నాన్న పనిచేయడంతో లోకల్‌ క్యాండెట్‌ అని తాను చెప్పుకుంటున్నాడు. అయితే కాంగ్రెస్‌ లేకపోతే మామ సాయంతో గులాబీ టికెట్‌ కొట్టేయాలనేది ఈయన ప్లాన్‌. సిట్టింగ్‌ ఎమ్మెల్యే గ్రాఫ్‌ పడిపోతే.. సర్వేలో తాను ముందు ఉంటే టీఆర్‌ఎస్‌ టికెట్‌ తనకే వస్తుందనేది మదన్‌ ప్లాన్‌గా తెలుస్తోంది. అయితే టీఆర్‌ఎస్‌ నుంచి ఇక్కడ ఓ యువ నేత టికెట్‌ ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. విద్యావంతుడైన ఆ యువనేతది రాజకీయ కుటుంబమే. ప్రస్తుతం వాళ్ల కుటుంబం నుంచి స్థానిక సంస్థల్లో ఇద్దరు గెలిచారు. అవకాశం ఇస్తే తన సత్తా నిరూపించుకునేందుకు ఆ యువ నేత రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకూ నిర్వహించిన రెండు సర్వేల్లో కూడా ఆ నేత పేరు వినిపించినట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి.

అయితే బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి ఈసారి పోటీ చేస్తారు. మొన్నటివరకూ ఆయన తిరిగి టీఆర్‌ఎస్‌లోకి వస్తారని టాక్‌ వినిపించింది. కానీ ఈటలకు పార్టీలో మంచి ప్లేస్‌ దొరకడంతో ఈయన పార్టీ మారడం కష్టమని అంటున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ఎల్లారెడ్డిలో త్రిముఖ పోటీ తప్పదని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News