నేటి నుంచి సిటీ రోడ్లపై గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల ప‌రుగు

ప్రతి బస్సులో 2 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్‌ బ్యాకప్‌ ఉంటుంది. బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా ఉంటుంది.

Advertisement
Update:2023-09-20 08:56 IST

సిటీలో ఇవాల్టి నుంచి గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ నేడు గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులను ప్రారంభిస్తారు. పర్యావరణహితమైన బస్సులను పెంచే ఆలోచనలో భాగంగా ఆర్టీసీ వీటిని అందుబాటులోకి తీసుకువచ్చింది. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ సర్వీసుల్లో ఫస్ట్‌ ఫేజ్‌లో 25 బస్సులను ప్రారంభించనున్నారు.

గచ్చిబౌలి స్టేడియం వ‌ద్ద ఈ బస్సులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ పాల్గొంటారు. ఇక మిగిలిన 25 బస్సులు నవంబర్‌ నాటికి అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ ప్రకటించింది.

ఈ బస్సులు వందశాతం పర్యావరణహితమని చెప్పారు ఆర్టీసీ అధికారులు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉందంటున్నారు. 3 గంట‌ల‌ నుంచి 4 గంటల లోపు వంద శాతం పూర్తి ఛార్జింగ్ అవ్వడ‌మే కాకుండా క్యాబిన్, సెలూన్‌లో రెండు చోట్ల సెక్యూరిటీ కెమెరాలు, ఒక నెల బ్యాకప్ స‌దుపాయాలు క‌లిగి ఉన్నాయి.

గ్రీన్ లగ్జరీ ఏసీ బస్సు స్పెషాలిటీస్‌:

12 మీటర్ల పొడవు ఉండే ఈ గ్రీన్ లగ్జరీ ఏసీ బస్సులు అత్యాధునిక సౌక‌ర్యాల‌తో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు.

35 సీట్ల సామర్థ్యం గ‌ల ఈ బస్సుల్లో ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు రీడింగ్‌ ల్యాంప్‌ లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్‌ బటన్‌ సదుపాయం ఉంది. వాటిని టీఎస్‌ ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు.

ప్రతి బస్సులో 2 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్‌ బ్యాకప్‌ ఉంటుంది. బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనుక ఎల్ఈడీ బోర్డులు ఉంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిపిస్తాయి.

అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి.. నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఇన్ఫర్మేషన్‌ ఇచ్చేందుకు వీలుగా పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం బస్సుల్లో ఉంటుంది.

*

Tags:    
Advertisement

Similar News