సస్పెన్షన్ కాదు, మోదీ స్పందించాలి.. దేశాన్ని నాశనం చేస్తున్నారు..
హైదరాబాద్ లో ఇంత రగడ జరిగితే ప్రధాని నరేంద్రమోదీ స్పందించకపోవడం దారుణం అన్నారు. పార్టీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం కాదు, పార్టీ పెద్దలు తమ వైఖరి ఏంటో స్పష్టం చేయాలన్నారు.
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. దేశాన్ని నాశనం చేయడానికి బీజేపీ తమ నాయకులతో ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తోందంటూ ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ లో శాంతిని చూడాలని బీజేపీ కోరుకోవడం లేదని, వారు ముహమ్మద్ ప్రవక్తను, ముస్లింలను ద్వేషిస్తారని అన్నారు. భారతదేశ సామాజిక వ్యవస్థను నాశనం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయంగా తమతో పోరాడండి కానీ, ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడొద్దని విమర్శించారు.
మోదీ స్పందించాల్సిందే..
హైదరాబాద్ లో ఇంత రగడ జరిగితే ప్రధాని నరేంద్రమోదీ స్పందించకపోవడం దారుణం అన్నారు. పార్టీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం కాదు, పార్టీ పెద్దలు తమ వైఖరి ఏంటో స్పష్టం చేయాలన్నారు. రాజాసింగ్ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ, బీజేపీ మద్దతు లేదు అని నిరూపించుకోవాలంటే, వారు తక్షణం స్పందించాలన్నారు. మొత్తమ్మీద ఈ వ్యవహారం ఇప్పుడు బీజేపీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇటీవలే నుపుర్ శర్మ వివాదంలో అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న బీజేపీ, ఇప్పుడు రాజాసింగ్ నోటి దురుసుతో మరోసారి తలదించుకోవాల్సి వస్తోంది.
రాజాసింగ్ కి బెయిల్..
మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలతో అరెస్ట్ అయిన రాజాసింగ్ కి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మొదట 14రోజుల రిమాండ్ విధించిన కోర్టు, ఆ తర్వాత బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. 41 సీఆర్పీసీ కండిషన్ పోలీసులు పాటించలేదని రాజాసింగ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు, పోలీసులు రిమాండ్ చేసిన విధానం సరిగా లేదని అభిప్రాయపడుతూ.. రాజాసింగ్ రిమాండ్ ను తిరస్కరించి, ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.