ఆ విషయంలో తెలంగాణ చాలా గ్రేట్ - అసద్ ప్రశంసలు
ఇండియా టుడే నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న అసదుద్దీన్ తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.
దేశంలో మైనార్టీల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం తరహాలో రూ.12వేల కోట్లు ఖర్చు చేసిన ఏ ఒక్క రాష్ట్రాన్ని అయినా చూపించాలని సవాల్ చేశారు MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. సెక్యూలర్ అని చెప్పుకుంటున్న పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇది జరగలేదన్నారు. ఇండియా టుడే నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న అసదుద్దీన్ తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. మైనార్టీల కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 201 రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసిందన్నారు. అందులో బాయ్స్, గర్ల్స్‌కు వేర్వేరుగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయన్నారు. ఈ స్కూల్స్‌లో దాదాపు లక్షా 20 వేల మంది ముస్లిం పిల్లలు ఉచితంగా నాణ్యమైన విద్యను అందుకుంటున్నారని చెప్పారు. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేశారని చెప్పారు.
ఇక ముస్లిం మహిళల కోసం షాదీ ముబారక్ లాంటి అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు అసదుద్దీన్. షాదీ ముబారక్ స్కీం ద్వారా గడిచిన 9 ఏళ్లలో దాదాపు రూ.2 వేల కోట్లు ముస్లిం మహిళలకు అందాయన్నారు. అదే జాతీయ పార్టీలు అధికారంలో ఉంటే మూకదాడులు, హిజాబ్, రిజర్వేషన్ల అంశం లాంటి వివాదాలు ఉంటాయన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా MIM 9 స్థానాల్లో పోటీ చేస్తోంది. తాము పోటీ చేయని చోట బీఆర్ఎస్‌కు ఓటేయాలని ఇప్పటికే మైనార్టీలకు పిలుపునిచ్చారు అసదుద్దీన్ ఓవైసీ. ఇటీవల కాంగ్రెస్‌పై విమర్శల దాడి పెంచిన అసదుద్దీన్.. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ హ్యాట్రిక్ ఖాయమన్నారు.