తెలంగాణ సర్కారు బడుల్లో మారనున్న మధ్యాహ్న భోజనం మెనూ.. జూన్ 12 నుంచి అమలు

ఇటీవల పీఎం పోషన్ (మిడ్ డే మీల్ స్కీమ్) అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్బంగా తెలంగాణ పాఠశాల్లలో అమలు చేస్తున్న మిడ్ డే మీల్స్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.

Advertisement
Update:2023-06-01 21:28 IST

తెలంగాణ విద్యా శాఖ సర్కారు బడుల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేసింది. 2023-24 విద్యా సంవత్సరం మొదటి రోజు అయిన జూన్ 12 నుంచి.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాన్ - రెసిడెన్షియల్ స్కూల్స్‌లో అందిస్తున్న మిడ్ డే మీల్స్‌కు సంబంధించి మార్పులు చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇటీవల పీఎం పోషన్ (మిడ్ డే మీల్ స్కీమ్) అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్బంగా తెలంగాణ పాఠశాల్లలో అమలు చేస్తున్న మిడ్ డే మీల్స్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఏ రకమైన మెనూ అమలులో ఉన్నదో పరిశీలించారు. కాగా, ఈ ఏడాది నుంచి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మార్గదర్శాల మేరకు మెనూలో మార్పులు చేయాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు జూన్ 12 నుంచి కొత్త మెనూ అమలు చేయాలని అన్ని మండలాల విద్యాశాఖ అధికారులకు, హెడ్ మాస్టర్లకు ఉత్తర్వులు పంపించారు. పాఠశాలలు రీ ఓపెనింగ్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మెనూను అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మెనూ ఇలా..

సోమవారం - కిచిడి, మిక్స్‌డ్ వెజిటెబుల్ కర్రీ, గుడ్డు

మంగళవారం - అన్నం, సాంబార్, మిక్స్‌డ్ వెజిటెబుల్ కర్రీ

బుధవారం - అన్నం, ఆకు కూర పప్పు, మిక్స్‌డ్ వెజిటెబుల్ కర్రీ, గుడ్డు

గురువారం - వెజిటెబుల్ బిర్యానీ, మిక్స్‌డ్ వెజిటెబుల్ కర్రీ

శుక్రవారం - అన్నం, సాంబార్, మిక్స్‌డ్ వెజిటెబుల్ కర్రీ, గుడ్డు

శనివారం - అన్నం, ఆకుకూర పప్పు, మిక్స్‌డ్ వెజిటెబుల్ కర్రీ

ఉదయాన్నే అల్పహారం అందించనున్న తెలంగాణ ప్రభుత్వం..

కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ విద్యా సంవత్సరం నుంచి ఉదయం అల్పాహారం కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నది. చాలా మంది పిల్లలు ఉదయాన్నే ఏమీ తినకుండా స్కూల్‌కు వస్తున్నారని.. నేరుగా మధ్యాహ్నం భోజనం చేస్తుండటంతో రక్తహీనత, ఇతర బలహీనతలతో బాధపడుతున్నారని అధికారులు గుర్తించారు. దీంతో ఇకపై ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య టిఫిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ రోజు బెల్లంతో చేసిన రాగి జావను అందించాలని ఇప్పటికే పాఠశాలలకు ఉత్తర్వులు అందాయి. దీనికి సంబంధించి బెల్లం పొడి, రాగుల పౌడర్ ప్రభుత్వమే సప్లయ్ చేయనున్నట్లు తెలిపారు.



 


Tags:    
Advertisement

Similar News