మిచిగాన్ యూనివర్సిటీ మెచ్చిన పథకం "మిషన్ కాకతీయ" : మంత్రి కేటీఆర్

ప్రతీ చెరువు.. కరువును శాశ్వతంగా తీర్చిన కల్పతరువుగా మారింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసింది మిషన్ కాకతీయ పథకం అని కేటీఆర్ అన్నారు.

Advertisement
Update:2023-06-08 11:24 IST

అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీతో పాటు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా మెచ్చిన పథకం మిషన్ కాకతీయ. చుక్క నీరు లేక చిక్కిశల్యమైన అమ్మలాంటి ఊరి చెరువుకు ఊపిరి పోసిన నాయకుడు సీఎం కేసీఆర్. గొలుసు కట్టు చెరువుల గోస తీర్చింది మన సీఎం కేసీఆర్ అని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు చెరువుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ నేపథ్యంలో మిషన్ కాకతీయ విజయాన్ని ఉటంకిస్తూ.. కేటీఆర్ ఒక కవితను ట్వీట్ చేశారు.

ప్రతీ చెరువు.. కరువును శాశ్వతంగా తీర్చిన కల్పతరువుగా మారింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసింది మిషన్ కాకతీయ పథకం అని కేటీఆర్ అన్నారు. ఊరి పొలిమేరల్లో ఉన్న చెరువును ప్రతి గుండెకు చేరువ చేసిన చరిత్ర ఇది అన్నారు. తెలంగాణ దశాబ్ది అమృతోత్సవ వేళలో మన మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శమైందని.. ఇది అమృత్ సరోవర్ పేరిట దేశమంతా ఆవిష్కృతమైందని కేటీఆర్ తెలిపారు.

తెలంగాణలోని చెరువులు మండు వేసవిలో కూడా మత్తడు దుంకుతున్నాయని అన్నారు. ఈ పథకం అనేక ఫలితాలను ఇచ్చింది. పూడిక మట్టితో పంట పొలాల్లో సారం పెరిగింది. చెరువులో నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భ జలాల మట్టాలు గణనీయంగా పెరిగాయని కేటీఆర్ అన్నారు. చెరువులపై ఆధారపడిన కుల వృత్తులకు పూర్వ వైభవం వచ్చింది. జీవాలకు, పాడి పశువులకు నీటి కొరత తీరిందని మంత్రి కేటీఆర్ చెప్పారు.

మిషన్ కాకతీయ కారణంగా చెరువులు జల కళను సంతరించుకున్నాయి. దీంతో పల్లెల్లో పచ్చదనం పెరిగింది, వాతావరణ పూర్తిగా మారిపోయిందని చెప్పారు. చెరువుల్లో కాళేశ్వరం నీటిని నింపడంతో అవి నీళ్లతో కళకళలాడుతున్నాయని మంత్రి చెప్పారు.

మంత్రి కేటీఆర్ చేసిన మిషన్ కాకతీయ కవిత..

పదేళ్ల క్రితం...

ఏ చెరువును చూసినా గుండెబరువు

వాటిపై ఆధారపడిన కులవృత్తులకు లేదు బతుకుదెరువు

కానీ..

దశాబ్ది ఉత్సవాల వేళ

ప్రతి చెరువు...

కరువును శాశ్వతంగా తీర్చిన కల్పతరువు

చుక్కనీరు లేక చిక్కిశల్యమైన

అమ్మలాంటి ఊరి చెరువుకు

ఊపిరిపోసిన నాయకుడు...

గొలుసుకట్టు చెరువుల

గోస తీర్చిన పాలకుడు...

ముఖ్యమంత్రి కేసిఆర్ గారు...

చెరువులకు పట్టిన

దశాబ్దాల శిలుమును

వదిలించిన విప్లవం పేరే..

మిషన్ కాకతీయ

"వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా"

మెచ్చిన పథకమిది

"మిచిగాన్ యూనివర్సిటీ"కి

నచ్చిన పథకమిది

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు

ప్రాణం పోసిన తరుణమిది

పొలిమేరల్లో ఉన్న చెరువును

ప్రతి గుండెకు చేరువ చేసిన చరిత్ర ఇది.

అమృతోత్సవ వేళ

మన మిషన్ కాకతీయ

దేశానికే ఆదర్శమైంది..

“తెలంగాణ మోడల్”

“అమృత్‌ సరోవర్‌” రూపంలో

దేశవ్యాప్తంగా ఆవిష్కృతమైంది.

మండువేసవిలో

మత్తడి దుంకుతున్న చెరువుల సాక్షిగా...

ఈ మహాయజ్ఞంలో

మనసుపెట్టి పనిచేసిన ప్రతిఒక్కరికి...

దశాబ్ది ఉత్సవాల సందర్భంగా

చెరువుల పండుగ శుభాకాంక్షలు...

ఒక్క పథకం..

ఫలితాలు అనేకం.. 


Tags:    
Advertisement

Similar News