ముంచుకొస్తున్న మిచాంగ్ తుపాను.. ఈనెల 2 నుంచి భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలపడింది. అనంతరం వాయవ్య దిశగా కదులుతూ డిసెంబర్‌ రెండో తేదీ తుపానుగా మారుతుందని ఐఎండీ నివేదికలో ప్రకటించింది.

Advertisement
Update:2023-12-01 07:54 IST

తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 2 మిచాంగ్ తుపాను ప్రభావం మొదలయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తుపాను ప్రభావం ఈనెల 4 నుంచి మొదలవుతుందని ఇంతకు ముందు అంచనా వేసినా.. రెండు రోజుల ముందే ఆ ప్రభావం కనపడేలా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుపాను ప్రభావం ఏపీపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వాతావరణ విభాగం అధికారులు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలపడింది. అనంతరం వాయవ్య దిశగా కదులుతూ డిసెంబర్‌ రెండో తేదీ తుపానుగా మారుతుందని ఐఎండీ నివేదికలో ప్రకటించింది. ఈ తుపాను ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో ఎక్కువగానూ, ఉత్తర కోస్తాలో స్వల్పంగానూ ఉంటుంది. డిసెంబర్‌ 2నుంచి 5వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో కురిసే వర్షాలకు పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని, కోతలకు సిద్ధమై­న వరి పంటలను సత్వరమే కోసుకోవాలని రైతు­లకు ఐఎండీ సూచించింది.

మయన్మార్ నామకరణం..

డిసెంబర్‌ 2న ఏర్పడబోయే తుపానుకు మిచాంగ్‌ గా నామకరణం చేయబోతున్నారు. ఈ పేరును మయన్మార్‌ దేశం సూచించింది. నిబంధనల ప్రకారం తుపానుగా మారాకే దా­ని పేరును అధికారికంగా ప్రకటిస్తారు. అయితే మిచాంగ్ ప్రభావం ఇప్పటికే మొదలైందని తెలుస్తోంది. ఏపీలో తీవ్ర ప్రభావం కనిపించబోతోంది. తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా. 

Tags:    
Advertisement

Similar News