విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన మెట్రో.. నేటి నుంచి మెట్రో రైళ్లలో స్టూడెంట్ పాస్
స్టూడెంట్ పాస్ ఆఫర్ 1 జూలై 2023 నుంచి 21 మార్చి 2024 వరకు 9 నెలల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్ మెట్రో విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇకపై మెట్రోలో కూడా స్టూడెంట్ పాస్ ప్రవేశపెడుతున్నామని, జూలై 1 నుంచే ఈ పాస్ అమలులోకి వచ్చిందని ప్రకటించింది. మెట్రో రైల్ సూపర్ సేవర్ స్టూడెంట్ పాస్-2023 పేరుతో తీసుకొని వస్తున్న ఈ పాస్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు త్వరగా స్కూల్స్, కాలేజీలకు చేరుకొని.. తిరిగి ఇంటికి తిరిగి రావడానికి మెట్రో రైలు సేవలను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
మెట్రో స్టూడెంట్ పాస్ పొందేందుకు 1998 ఏప్రిల్ 1 తర్వాత పుట్టిన వారందరూ అర్హులే అని తెలిపారు. ఈ ఆఫర్ కింద విద్యార్థులు 20 ట్రిప్పులకు మాత్రమే చెల్లించి.. అన్ని ఫేర్ జోన్లలో 30 ట్రిప్పుల వరకు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుందని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. కాగా, మెట్రో స్టూడెంట్ పాస్ కోసం.. విద్యార్థులు తప్పని సరిగా బ్రాండెడ్ స్మార్ట్ కార్డు కొనుగోలు చేయాలని సూచించారు. ఒక విద్యార్థికి ఒక స్మార్ట్ కార్డు మాత్రమే జారీ చేస్తామని.. కొనుగోలు చేసిన దగ్గర నుంచి 30 రోజుల పాటు చెల్లుతుందని మెట్రో ఎండీ చెప్పారు.
స్టూడెంట్స్ ఈ బ్రాండ్ న్యూ మెట్రో కార్డును ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో కొనుగోలు చేయవచ్చు. రెడ్ లైన్‌లో జేఎన్‌టీయూ కాలేజ్, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, విక్టోరియా మెమోరియల్ స్టేషన్లలో.. గ్రీన్ లైన్‌లో నారాయణగూడ స్టేషన్‌లో.. బ్లూ లైన్‌లో నాగోల్, పరేడ్ గ్రౌండ్స్, బేగంపేట, రాయదుర్గం మెట్రో స్టేషన్లలో ఈ స్మార్ట్ కార్డులు అందుబాటులో ఉంటాయి.
ఈ స్టూడెంట్ పాస్ ఆఫర్ 1 జూలై 2023 నుంచి 21 మార్చి 2024 వరకు 9 నెలల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.