ఉగాది వేళ మెట్రో గుడ్‌న్యూస్.. సబ్సిడీలు ఆరు నెలలు పొడిగింపు
సెలవు రోజుల్లో రూ.59కే అపరిమిత ప్రయాణం చేయడానికి వీలు కల్పించే సూపర్ సేవర్ మెట్రో హాలీ డే కార్డుకు మంచి డిమాండ్ ఉంది. ఆదివారాలతో పాటు పబ్లిక్ హాలీ డేల్లో దీన్ని వాడుకోవచ్చు.
ప్రయాణికులకు ఇస్తున్న అన్నిరకాల రాయితీలను ఎత్తేస్తున్నట్లు నిన్న ప్రకటించిన హైదరాబాద్ మెట్రో రైల్ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. వాటిని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఉగాది వేడుకల్లో భాగంగా సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్స్, సూపర్ పీక్ అవర్ ఆఫర్లను ఆరు నెలల పాటు పొడిగించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇవీ ఆ ఆఫర్లు
సెలవు రోజుల్లో రూ.59కే అపరిమిత ప్రయాణం చేయడానికి వీలు కల్పించే సూపర్ సేవర్ మెట్రో హాలీ డే కార్డుకు మంచి డిమాండ్ ఉంది. ఆదివారాలతో పాటు పబ్లిక్ హాలీ డేల్లో దీన్ని వాడుకోవచ్చు. ఇక రద్దీ లేని సమయాల్లో ప్రయాణ ఛార్జీల్లో 10 శాతం రాయితీ ఇచ్చే సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్‌ను కూడా సాధారణ ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇక స్టూడెంట్స్ కోసం 20 రైడ్స్ ధరకు 30 సార్లు ప్రయాణించే మెట్రో స్టూడెంట్ పాస్‌కు కూడా స్టూడెంట్స్ నుంచి చాలా డిమాండ్ ఉంది. ఈ రాయితీలన్నీ మార్చి 31 తోనే ముగిసిపోయాయి.
5 లక్షలకు చేరిన ప్యాసింజర్లు
నగరవాసులకు మెట్రో నమ్మకమైన ప్రయాణ సాధనంగా మారుతోంది. రోజూ 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. దీనికి రాయితీలు కూడా ఓ కారణం. ఆ రాయితీలను ఉగాది సందర్భంగా మరో ఆరు నెలలు పొడిగిస్తూ మెట్రో రైల్ నిర్ణయం తీసుకుంది.
వేసవిలో మరింత డిమాండ్
మెట్రోలో ఏసీ ప్రయాణం కావడంతో వేసవిలో నగరవాసులు ఎక్కువగా మెట్రోను ఉపయోగిస్తున్నారు. మెట్రో స్టేషన్లలో తమ వాహనాలు పార్క్ చేసి, గమ్యస్థానాలకు మెట్రోలో వెళ్లేవారి సంఖ్య పెరుగుతుండటంతో రద్దీతో మెట్రోలు కళకళలాడుతున్నాయి.