న్యూ ఇయర్ ధమాకా.. ఏకంగా డ్రగ్స్ తయారీ ప్లాంట్ పెట్టేశారు
ముందుగానే ఆర్డర్లు తీసుకుని డ్రగ్స్ తయారు చేస్తున్నారు. వాటిని న్యూ ఇయర్ పార్టీలకు చేరవేయడమే తరువాయి. అయితే సప్లై మొదలయ్యే లోగా అధికారులు దాడులు చేశారు.
కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు యువత సన్నాహాలు చేసుకుంటోంది. మందు పార్టీలు, అపార్ట్ మెంట్లలో జరిగే పార్టీలు ఇవన్నీ కామన్. అయితే డ్రగ్స్ లో యువతను ముంచేందుకు ఓ మాఫియా ముఠా న్యూ ఇయర్ వేడుకను ఉపయోగించుకోవాలనుకుంది. 50కోట్ల రూపాయల బిజినెస్ టార్గెట్ గా పెట్టుకుంది. ఏకంగా హైదరాబాద్ శివార్లలో డ్రగ్స్ తయారీ ప్లాంట్ పెట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముందుగానే ఈ వ్యవహారాన్ని పసిగట్టిన డీఆర్ఐ అధికారులు ఆ డ్రగ్స్ ని సీజ్ చేశారు. ఏడుగురిని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకి తరలిందారు.
డిసెంబర్ 21నుంచి సీక్రెట్ ఆపరేషన్..
కొత్త సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ సరఫరా పెద్ద ఎత్తున జరుగుతుందని డీఆర్ఐ అధికారులకు సమాచారం వచ్చింది. దీని ప్రకారం వాళ్లు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. చర్లపల్లి, బోడుప్పల్ ప్రాంతాల్లో రెండు ల్యాబ్ లు ఏర్పాటు చేసి మరీ అందులో డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. మెఫీ డ్రిన్ డ్రగ్ తయారు చేయడానికి కావలసిన ముడి పదార్థాలను తీసుకువచ్చి గుట్టు చప్పుడు కాకుండా ఈ ల్యాబ్ లలో తయారీ మొదలు పెట్టింది ఆ ముఠా. పైకి ప్రైవేట్ ల్యాబొరేటరీలు, కానీ లోపల మాత్రం డ్రగ్స్ తయారు చేస్తున్నారు. డీఆర్ఐ అధికారులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి ఆ ముఠా గుట్టు రట్టు చేశారు.
న్యూ ఇయర్ పార్టీ ఆర్డర్లు..
ముందుగానే ఆర్డర్లు తీసుకుని డ్రగ్స్ తయారు చేస్తున్నారు. వాటిని న్యూ ఇయర్ పార్టీలకు చేరవేయడమే తరువాయి. అయితే సప్లై మొదలయ్యే లోగా అధికారులు దాడులు చేశారు. డ్రగ్స్ తయారీలో కీలక సూత్రధారి, ఫైనాన్షియర్ రూ.60 లక్షల నగదుతో నేపాల్‌కు పారిపోతుండగా గోరఖ్ పూర్ లో అరెస్టు చేశారు. అరెస్టయిన ఏడుగురు నిందితులు గతంలో కూడా డ్రగ్స్ తయారీ కేసుల్లో ముద్దాయిలే. జైలు నుంచి తప్పించుకుని మళ్లీ అదే పని మొదలు పెట్టారు. ఇప్పుడిలా మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. ఇప్పటి వరకూ డ్రగ్స్ వేరే ప్రాంతాలనుంచి తెచ్చి ఇక్కడ విక్రయించే ముఠాలనే పట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ తయారీ ముఠా దొరకడం సంచలనంగా మారింది.