సినిమా ఎందుకు..? ఆస్పత్రికి నేనే వస్తా - చిరంజీవి

ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి, బాధితురాలిని పరామర్శించడంతోపాటు, సినిమా చూపిస్తూ ఆపరేషన్ చేసిన వైద్యుల్ని నేరుగా కలసి అభినందించేందుకు గాంధీ ఆస్పత్రికి వస్తానంటూ కబురు పంపించారు.

Advertisement
Update:2022-08-27 09:05 IST

చిరంజీవి గాంధీ ఆస్పత్రికి వస్తానన్నారు. ఆయనకు గాంధీ ఆస్పత్రికి రావాల్సిన అవసరం ఏముంది, ఆయన వియ్యంకులకి సొంత ఆస్పత్రే ఉంది కదా అనుకోకండి. ఆయన వస్తానన్నది పరీక్షలకోసం కాదు, పరామర్శకోసం. ఇటీవల చిరంజీవి అభిమాని అయిన ఓ వృద్ధురాలికి గాంధీ ఆస్పత్రిలో ఆయన సినిమా చూపిస్తూ ఆపరేషన్ చేశారు వైద్యులు. 'అడవి దొంగ సినిమా చూపిస్తూ ఆపరేషన్' అనే ఈ వార్త వైరల్ గా మారింది, చిరంజీవి వరకు వెళ్లింది. వెంటనే స్పందించిన చిరంజీవి తన పీఆర్వోను గాంధీ ఆస్పత్రికి పంపించారు.

ఆ వృద్ధురాలు మెగా అభిమాని..

మెదడులో కణితితో బాధపడుతున్న ఆ వృద్ధురాలు చిరంజీవి అభిమాని. ఆమెకు ఆపరేషన్ చేసే సమయంలో ట్యాబ్ లో చిరంజీవి సినిమా 'అడవి దొంగ' చూపిస్తూ వైద్యులు కణితి తొలగించారు. ఆపరేషన్ తర్వాత ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆస్పత్రికి వచ్చిన చిరంజీవి పీఆర్వో ఆమెతో మాట్లాడారు. తాను చిరంజీవి వీరాభిమానిని అని ఆమె చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి, బాధితురాలిని పరామర్శించడంతోపాటు, సినిమా చూపిస్తూ ఆపరేషన్ చేసిన వైద్యుల్ని నేరుగా కలసి అభినందించేందుకు గాంధీ ఆస్పత్రికి వస్తానంటూ కబురు పంపించారు.

కొన్ని కొన్ని విషయాలు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయో చెప్పలేం. బహుశా చిరంజీవిని కలవడం ఆ వృద్ధురాలు తనకు అసాధ్యం అనుకొని ఉండొచ్చు. కానీ గాంధీ ఆస్పత్రిలో వైద్యులు ఆమె అభిమాన హీరో చిరంజీవి సినిమా చూపించడంతో ఆమె కల నెరవేరినట్టయింది. ఆపరేషన్ సమయంలో తెరపై చిరంజీవిని చూసిన ఆమెకు ఆస్పత్రి బెడ్ నుంచి నేరుగా చిరంజీవిని కలిసే అవకాశం దక్కింది. చిరంజీవి నేరుగా ఆమెకోసం ఆస్పత్రికే వస్తానన్నారు.

Tags:    
Advertisement

Similar News