100 ఎకరాల్లో సభ, 400 ఎకరాల్లో పార్కింగ్.. ఖమ్మం BRS సభకు భారీ ఏర్పాట్లు

ఇప్పటికే ఖమ్మం నగరం పార్టీ హోర్డింగులు, కటౌట్లతో గులాబీమయమయింది. 100 ఎకరాల్లో సభ, 400 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. 15 వేల మంది వీఐపీలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement
Update:2023-01-16 17:27 IST

భారత రాష్ట్ర సమితి (BRS)ఏర్పాటు తర్వాత మొదటి బహిరంగ సభను ఖమ్మంలో ఈ నెల 18 న నిర్వహించబోతున్న ఆ పార్టీ అందుకోసం భారీ ఏర్పాట్లను చేస్తున్నది. దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకునేందుకు ప్రతిష్టాత్మకంగా జరపబోతున్న ఈ సభను విజయవంతం చేయడం కోసం కేసీఆర్ స్వయంగా నాయకులను గైడ్ చేస్తున్నారు.

ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో పాటు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ గత ఐదు రోజులుగా ఉమ్మడి ఖమ్మంజిల్లాలో పర్యటిస్తున్నారు. సభా వేదిక వద్ద చేయాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు పరిశీలించి పార్టీ నాయకులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఇప్పటికే ఖమ్మం నగరం పార్టీ హోర్డింగులు, కటౌట్లతో గులాబీమయమయింది. 100 ఎకరాల్లో సభ, 400 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. 15 వేల మంది వీఐపీలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా వారికి కేటాయించిన స్థలంలో పార్కింగ్ చేసేలా డ్రైవర్లకు క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. వీఐపీల కోసం సభా వేదిక ముందు 20 వేల కుర్చీలను ఏర్పాటు చేయనున్నారు. 5 లక్షల మందికి పైగా ప్రజ‌లు సభకు హాజరుకాబోతున్నారు. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే 3 లక్షల్ అమంది వస్తారని అంచనా.

ఇక మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణం లోపల, బయటా సుమారు అతిపెద్ద 50- LED స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చిన వారి కోసం పది లక్షల మంచి నీటి ప్యాకెట్లు, వెయ్యి మంది వాలంటీర్లు అందుబాటులో ఉంటారని నేతలు చెబుతున్నారు. సభకు హాజరయ్యే నలుగురు ముఖ్యమంత్రులు, జాతీయ నేతల భారీ కటౌట్లు, హోర్డింగులు సభా ప్రాంగణం, ప్రధాన రహదారుల పక్కన ఖమ్మం నగరంలో ఏర్పాటు చేస్తున్నారు.

కొత్త కలెక్టరేట్‌ సమీపంలోని వెంకటాయపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ స్థలాన్ని మంత్రులు హరీశ్‌రావు, అజయ్‌కుమార్‌, దయాకర్‌రావు, జి. జగదీశ్‌రెడ్డి,ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు తదితరులు పరిశీలించారు.

ఈ సభ ద్వారా కేసీఆర్ బీఆరెస్ ఎజెండాను దేశ ప్రజల ముందు ఉంచబోతున్నారు. వ్యవసాయమే ప్రధాన ఎజెండాగా బీఆరెస్ రాజకీయాలు ఉండబోతున్నాయి. అదే విధంగా రైతులు, స్త్రీలు, విద్యార్థులు, వృద్దులు, వెనకబడిన కులాలు...తదితర వర్గాల కోసం తెలంగాణలో బీఆరెస్ ప్రభుత్వం చేపట్టి విజయవంతం చేసిన పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం గురించి కేసీఆర్ నొక్కి చెప్పబోతున్నారు.

ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్,పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఇతర జాతీయ నేతలు హాజరవుతారు.

Tags:    
Advertisement

Similar News