మెడికో ప్రీతి ఆత్మహత్య కేసు: సైఫ్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు

పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో అనేక కీలక విషయాలు వెలుగుచూశాయి. సైఫ్ ప్రీతిని అందరి ముందు కులం పేరుతో హేళన చేయడం, వేధించడం, ఆమెను వేధించాలంటూ ఇతరలను కూడా ప్రోత్సహించడం తదితర విషయాలు రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నాయి.

Advertisement
Update:2023-03-01 16:38 IST

వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్య సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె సీనియర్ వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో నిందితుడు సైఫ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం సైఫ్ వరంగల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

పోలీసులు కోర్టుకు సమర్పించిన సైఫ్ రిమాండ్ రిపోర్ట్ లో అనేక కీలక విషయాలు వెలుగుచూశాయి. సైఫ్ ప్రీతిని అందరి ముందు కులం పేరుతో హేళన చేయడం, వేధించడం, ఆమెను వేధించాలంటూ ఇతరలను కూడా ప్రోత్సహించడం తదితర విషయాలు రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నాయి.

సైఫ్ ఫోన్ లో పోలీసులు 17 వాట్సప్ చాట్స్‌ను పరిశీలించారు.అనుషా, భార్గవి, LDD+ knockouts వాట్సప్ గ్రూప్ చాట్స్‌ను విశ్లేషించి కీలక‌ విషయాలను గుర్తించారు. ఈ వాట్సప్ చాట్స్ ఆధారంగా అసలు ఏం జరిగిందో పోలీసులు ఓ అంచనాకు వచ్చారు.

సైఫ్... ప్రీతిని సూపర్వైజ్ చేశాడని, రెండు ఘటనల ఆధారంగా కోపం పెంచుకున్నాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.

డిసెంబర్‌లో జరిగిన ఒక యాక్సిడెంట్ కేసుకు సంబంధించి ప్రీతి ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్ట్ రాయగా.. దానిని వాట్సప్ గ్రూపులో పెట్టి సైఫ్ అవహేళన చేశాడు. పైగా ప్రీతి కులాన్ని ఉదహరిస్తూ రిజర్వేషన్‌లో ఫ్రీ సీట్ వచ్చిందంటూ ఆమె పట్ల అవమానకరంగా మాట్లాడాడు. దీంతో తనతో ఏమైనా సమస్యనా? అని సైఫ్‌ను ప్రీతి ప్రశ్నించింది. ఏమైనా సమస్య ఉంటే హెచ్‌వోడీకి చెప్పాలి కానీ ఇలా చేయొద్దంటూ హెచ్చరించింది. దీంతో పగ పెంచుకున్న సైఫ్ ప్రీతిపై వేధింపులు ఎక్కువచేయడమే కాకుండా తన స్నేహితుడు భార్గవ్ ను కూడా ప్రీతిని వేధించాలని ప్రోత్సహించినట్టు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

ఇక ప్రీతిని వేధించడంలో భాగంగా ఆమెకు రెస్ట్ ఇవ్వకుండా డ్యూటీలు వేయాలని సైఫ్ ఇతరులను పురిగొల్పాడని పోలీసులు గుర్తించారు. కాగా ఈ విషయాలన్నింటిపై ప్రీతి గత నెల 21న హెచ్‌వోడీ నాగార్జునకి ఫిర్యాదు చేసింది. డాక్టర్లు మురళి, శ్రీకళ, ప్రియదర్శిని సమక్షంలో ప్రీతి, సైఫ్ ల‌కు వైద్యులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇది జరిగిన మరుసటి రోజే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందని సైఫ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

 

Tags:    
Advertisement

Similar News