ఆ వాట్సప్ చాటింగ్ ప్రీతి మనసు గాయపరిచింది..
సైఫ్ తనను టార్గెట్ చేసి వేధిస్తున్నాడంటూ ప్రీతి తన స్నేహితులతో చేసిన చాటింగ్ ని కూడా పోలీసులు గుర్తించారు. బ్రెయిన్ లెస్ ఫెలో అంటూ తనను సైఫ్ హేళనగా మాట్లాడేవాడంటూ ప్రీతి స్నేహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు గుర్తించారు.
వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో సీనియర్ విద్యార్థి సైఫ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. పీజీ విద్యార్థిని ప్రీతిని లక్ష్యంగా చేసుకుని సైఫ్ మానసికంగా వేధించేవాడని వరంగల్ సీపీ రంగనాథ్ చెప్పారు. అందరి ముందు ప్రీతిని అతడు అవమానించాడని, అందుకే ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిపారు.
ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి చాలా తెలివైన, ధైర్యం ఉన్న అమ్మాయి అని అన్నారు సీపీ రంగనాథ్. అయితే ఆమె సున్నిత మనస్కురాలని కూడా చెప్పారు. కాలేజీకి సంబంధించి ఓ కేస్ షీట్ విషయంలో ప్రీతిని అవమానించేలా సైఫ్ మాట్లాడాడని.. దానిపై ఈనెల 18న కాలేజీ వాట్సప్ గ్రూపులో మెసేజ్ ల వార్ జరిగిందని చెప్పారు. సైఫ్ పెట్టిన మెసేజ్ పై ప్రీతి పర్సనల్ గా ప్రశ్నించిందని, తనను ఉద్దేశించి గ్రూప్ లో వ్యక్తిగతంగా చాట్ చేయడం సరికాదని సైఫ్ కి హితవు పలికిందని పోలీసు విచారణలో తేలింది. ఏదైనా ఉంటే హెచ్.ఒ.డి. దృష్టికి తీసుకెళ్లాలని చెప్పిందని, కానీ సైఫ్ ఆధిపత్యం చలాయించేందుకు ప్రయత్నించాడని, దీంతో గొడవ పెద్దదైందని చెప్పారు సీపీ రంగనాథ్.
సైఫ్ తనను టార్గెట్ చేసి వేధిస్తున్నాడంటూ ప్రీతి తన స్నేహితులతో చేసిన చాటింగ్ ని కూడా పోలీసులు గుర్తించారు. బ్రెయిన్ లెస్ ఫెలో అంటూ తనను సైఫ్ హేళనగా మాట్లాడేవాడంటూ ప్రీతి స్నేహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు గుర్తించారు.
ప్రీతిని నేరుగా ర్యాగింగ్ చేయకపోయినా, ఆ వ్యక్తి అవమానంగా ఫీలయ్యేలా చేయడం కూడా ర్యాగింగ్ కిందకే వస్తుందని చెప్పారు పోలీసులు. ప్రీతిని లక్ష్యంగా చేసుకుని అవహేళన చేసినట్లు చాటింగ్ ద్వారా వెల్లడైందని, అందుకే సేకరించిన ఆధారాల ద్వారా సైఫ్ ను అరెస్ట్ చేశామన్నారు. సీనియర్లను జూనియర్లు సార్ అని పిలవాలనే కల్చర్ కూడా ఆ కాలేజీలో పీజీ స్టూడెంట్స్ మధ్య చిచ్చు పెట్టింది. ప్రీతి ఆత్మహత్యా యత్నానికి కూడా కారణం ఇదేనంటున్నారు. కేసును పక్కదోవ పట్టిస్తున్నారనే ఆరోపణల్లో నిజం లేదని అన్నారు వరంగల్ సీపీ రంగనాథ్. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల విచారణపై ప్రభావం పడుతుందని చెప్పారు.