అబద్ధాల ట్రైనింగ్ లో కూడా మోదీ ఫెయిల్.. ట్విట్టర్లో కేటీఆర్ పంచ్
ముగ్గురు కేంద్ర మంత్రులు, మూడు వేర్వేరు సందర్భాల్లో ఇలా స్పందించారు. కనీసం అబద్ధాలు చెప్పడంలో అయినా వీరికి సరిగా ట్రైనింగ్ ఇప్పించండి మోదీజీ అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్.
తెలంగాణకు మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో తమ తప్పేం లేదని, ఉన్న జిల్లాల్లోనే మళ్లీ కాలేజీలు కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపి తప్పు చేసిందని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనికి పక్కా ఆధారాలతో కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. కేటీఆర్ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. సిగ్గుతో ప్రభుత్వం తలదించుకునేలా చేశారాయన. తెలంగాణ ప్రజానీకం ముందు మరోసారి బీజేపీని దోషిగా నిలబెట్టారు.
అబద్ధాలు చెప్పి అడ్డంగా దొరికిపోయిన కేంద్ర మంత్రులు
పోనీ నిర్మలా సీతారామన్ చేసిన ఆరోపణలే నిజమనుకుందాం. అదే నిజమైతే, గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఇచ్చిన స్టేట్ మెంట్లు అబద్ధం అయి ఉండాలి. పోనీ వారి స్టేట్ మెంట్లే నిజమైతే, నిర్మలా సీతారామన్ అసత్యాలు వల్లెవేసి ఉండాలి. ఆ ముగ్గురు మంత్రులు వేర్వేరు సందర్భాల్లో మెడికల్ కాలేజీల గురించి ఏం మాట్లారో, వారి అఫిషియల్ ఖాతాల నుంచి వేసిన ట్వీట్లు, పేపర్ కటింగ్స్ తో సహా ట్విట్టర్లో పోస్ట్ చేశారు కేటీఆర్.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొత్తగా 90 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే, అందులో 9 తెలంగాణకే ఇచ్చింది – 2021 జులై 31న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్టేట్ మెంట్
మెడికల్ కాలేజీల కోసం ప్రతిపాదనలు పంపాలని కోరితే, తెలంగాణ నుంచి వచ్చిన ప్రతిపాదనలు సున్నా. - 2022 ఆగస్ట్ 29న కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ స్టేట్ మెంట్
మెడికల్ కాలేజీలకు ప్రతిపాదనలు కోరితే ఆల్రడీ కాలేజీలు ఉన్న కరీంనగర్, ఖమ్మం జిల్లాలనుంచే రెండు ప్రతిపాదనలు పంపించారు. - 2023 ఫిబ్రవరి 16న తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టేట్ మెంట్ ఇది
ముగ్గురు కేంద్ర మంత్రులు, మూడు వేర్వేరు సందర్భాల్లో ఇలా స్పందించారు. కనీసం అబద్ధాలు చెప్పడంలో అయినా వీరికి సరిగా ట్రైనింగ్ ఇప్పించండి మోదీజీ అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్.
ఆణిముత్యం కిషన్ రెడ్డి..
కరోనా టైమ్ లో కుర్ కురే ప్యాకెట్లు పంచి పెట్టిన మేథావి కిషన్ రెడ్డి అంటూ పలు సందర్భాల్లో ఓ ఆట ఆడేసుకునేవారు కేటీఆర్. తాజాగా వేసిన ట్వీట్ లో కూడా కిషన్ రెడ్డిని ఆణిముత్యం అంటూ ఎద్దేవా చేశారు. ఆయుష్ డిపార్ట్ మెంట్ హైదరాబాద్‌లో ‘గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్’ ను ఏర్పాటు చేస్తోందని అసత్య ప్రకటన చేశారన్నారు.
మొత్తమ్మీద కేంద్ర మంత్రులు చేసిన ప్రకటనలను ఒకేచోట చేర్చి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా అబద్ధాలు ఆడారనే విషయాన్ని రుజువు చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ విషయంలో కేంద్రం వివక్షను, కక్షపూరిత ధోరణిని మరోసారి బయటపెట్టారు.