జిల్లాకో మెడికల్ కాలేజీ.. ఇదే సీఎం కేసీఆర్ విజన్ : మంత్రి హరీశ్ రావు
ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ విజన్ అని మంత్రిచెప్పారు. ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. 58 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో మూడు మెడికల్ కాలేజీలు వస్తే.. సీఎం కేసీఆర్ హయాంలో 12 మెడికల్ కాలేజీలను ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నట్లు మంత్రి చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి అన్నారు. ఇక పీజీ సీట్లలో ద్వితీయ స్థానంలో నిలిచిందని చెప్పారు. ప్రతీ లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్, 7 పీజీ సీట్లు ఉన్నాయని హరీశ్ రావు అన్నారు.
ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ విజన్ అని మంత్రిచెప్పారు. ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. ఈ ఏడాది మరో 9 కాలేజీలను ఏర్పాటు చేయనున్నామని.. వీటిలో ఆరింటికి ఇప్పటికే అనుమతులు లభించాయని మంత్రి వెల్లడించారు. జనగాం, ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, భూపాలపల్లిమెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మెడికల్ అసెస్‌మెంట్ అంట్ రేటింగ్ బోర్డు (ఎంఏఆర్‌బీ) అనుమతులు వచ్చాయని చెప్పారు.
ప్రతీ కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి ఇచ్చినట్లు హరీశ్ రావు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇక నిర్మల్, కరీంనగర్, సిరిసిల్ల మెడికల్ కాలేజీల అనుమతుల విషయం తుది దశలో ఉందని మంత్రి చెప్పారు. ఈ మూడు కాలేజీలకు త్వరలోనే అనుమతులు వస్తాయని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచే అన్ని మెడికల్ కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తామని చెప్పారు. మెడికల్ కాలేజీలకు అప్రూవల్స్ రావడానికి అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారని మంత్రి చెప్పారు.
ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. కేవలం మెడికల్ విద్యకు సంబంధించిన కాలేజీలు ఏర్పాటు చేయడమే కాకుండా.. కంటి వెలుగు వంటి భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. మరోవైపు మహిళలకు పూర్తిగా ఉచిత పరీక్షలు చేస్తోంది. ప్రతీ మంగళవారం సమీపంలోని పీహెచ్‌సీలలో మహిళలకు పలు రకాల టెస్టులు ఉచితంగా చేసి.. ఏవైనా తీవ్రమైన సమస్యలు ఉంటే పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. వ్యవసాయం, విద్య తర్వాత వైద్య రంగానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారు.