మేడారం స్పెషల్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం

2014 మేడారం మహాజాతరలో సమ్మక్క-సారలమ్మలు గద్దెనెక్కిన రోజు, తెలంగాణబిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన రోజు ఒకటేనని గుర్తు చేశారు మంత్రి సీతక్క. తెలంగాణ రాష్ట్రం కూడా తల్లుల దీవెనలతోనే ఏర్పడిందని చెప్పారు.

Advertisement
Update:2024-01-18 09:16 IST

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఛాన్స్ తీసుకోవడంలేదు. ఇటీవల సంక్రాంతి స్పెషల్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఇప్పుడు మేడారం జాతర స్పెషల్ బస్సుల్లో కూడా మహిళల ఉచిత రవాణా సౌకర్యం అలాగే ఉంటుందని ప్రకటించారు మంత్రులు. సహజంగా పండగలు, ఇతర సందర్భాల్లో అదనంగా వేసే స్పెషల్ బస్సుల్లో ఇతర రాయితీలు వర్తించవు. కానీ మహిళల ఉచిత రవాణాకు మాత్రం అలాంటి ఆటంకాలు లేకుండా చూస్తున్నారు.

నెలరోజుల్లో మేడారం మహా జాతర జరగాల్సి ఉంది. మేడారం జాతర ఏర్పాట్లను మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ పర్యవేక్షించారు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అందరి సహకారంతో జాతరను విజయవంతం చేస్తామన్నారు మంత్రి సీతక్క. అభివృద్ధి పనుల విషయంలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులు చూడాలని సూచించారు. కాంట్రాక్టర్లకు వంతపాడే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా లోపాలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలన్నారు సీతక్క.

2014 మేడారం మహాజాతరలో సమ్మక్క-సారలమ్మలు గద్దెనెక్కిన రోజు, తెలంగాణబిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన రోజు ఒకటేనని గుర్తు చేశారు మంత్రి సీతక్క. తెలంగాణ రాష్ట్రం కూడా తల్లుల దీవెనలతోనే ఏర్పడిందని చెప్పారు. మహాజాతరకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. వరంగల్‌ ఆడబిడ్డలుగా జాతరలో పనిచేయడం తమ అదృష్టమని అన్నారు మంత్రి కొండా సురేఖ. దేవాదాయ శాఖ నుంచి రూ.1.50కోట్ల నిధులతో పూజారుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు.

యాదాద్రి ఆలయంపై సంచలన వ్యాఖ్యలు..

గత ప్రభుత్వ హయాంలో యాదగిరిగుట్టలో మూల విరాట్‌ను కదిలించి యాదాద్రి నిర్మించారని, అది శాస్త్రీయ తప్పిదమని అన్నారు మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ హయాంలో దేవాలయాల పవిత్రతను కాపాడతామని, మేడారం జాతరను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తామని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News