లక్డీకాపూల్ హోటళ్లలో మేయర్ ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్ మేయర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటల్స్‌లో మాంసం నిల్వపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లక్డీకాపూల్‌లో హోటల్స్‌లో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి హోటల్స్‌లో ఆహార పదార్థాలను పరిశీలించారు. మొఘల్ రెస్టారంట్‌ను తనిఖీ చేసిన మేయర్.. ఆహార పదార్థాలు, తయారీని పరిశీలించారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాణాలు పాటించకుండా మాంసం నిల్వ చేయడంపై యజమానిని నిలదీశారు. నిల్వ చేసిన మాంసం నమూనాలను ఆహార భద్రతా అధికారులు సేకరించారు. నివేదిక వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మేయర్ హెచ్చరించారు.
నగరంలో పలు హోటళ్లలో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు చేపట్టారు. రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని వారు గుర్తించారు. అలాగే నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గమనించారు.అదే విధంగా కాలం చెల్లిన బ్రెడ్, మిల్క్ ప్యాకెట్లు, మసాలాలు, బ్లాక్ సాల్ట్, పసుపు, సాస్‌లను సైతం ఆహార పదార్ధాల తయారీలో వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు వంట గది అపరిశుభ్రంగా ఉండడమే కాకుండా.. బొద్దింకలు సైతం తిరుగుతున్నట్లు ఉన్నతాధికారుల తనిఖీల్లో తేలింది. అదే విధంగా దసరా రెస్టారెంట్‌లో అయితే కుళ్ళిపోయిన మటన్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆయా ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అలాగే హోటల్, రెస్టారెంట్ యజమానులకు నోటీసులు సైతం ఫుడ్ సేఫ్టీ అధికారులు జారీ చేశారు.