కాంగ్రెస్‌ జాబ్ క్యాలెండర్‌ను నమ్మేదెట్లా..?

రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అనేది అసలు కార్యారూపం దాల్చుతుందా..! అది ఏడాదిలోగా.. అసలు అంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల భర్తీ సాధ్యమయ్యే పనే కాదంటున్నారు అనుభవజ్ఞులు.

Advertisement
Update:2023-11-26 11:28 IST

అధికారంలోకి వస్తే ఏడాదిలోగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్‌. ఇందుకు సంబంధించి పత్రికల్లో ఓ జాబ్ క్యాలెండర్‌ కూడా విడుదల చేసింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్‌ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ విశ్వసనీయతపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఏడాదిలోగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీలో భాగంగా.. 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్‌లు విడదల చేసి.. 2024 డిసెంబర్‌ 15నాటికి ప్రక్రియ పూర్తిచేస్తామని క్యాలెండర్‌లో స్పష్టంచేసింది. అయితే ఈ జాబ్‌ క్యాలెండర్‌ చట్టబద్ధతపై సందేహాలు లేవనెత్తుతున్నారు ఉద్యోగార్థులు. అసలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయాల్సింది తెలంగాణ స్టేట్ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌, రిక్రూటింగ్ ఏజెన్సీలు మాత్రమే. అసలు ఉద్యోగాల ఖాళీల విషయంలో ఏ మాత్రం అవగాహన లేకుండా కేవలం పేపర్‌లలో కాంగ్రెస్‌ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను ఎలా నమ్మాలని ఉద్యోగార్థులు ప్రశ్నిస్తున్నారు. 

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న టైమ్‌లో కాంగ్రెస్‌ జాబ్ క్యాలెండర్ ఎలా విడుదల చేస్తుందని ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్‌ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఏప్రిల్‌ 1 నుంచి మొదలు పెడతామని తెలిపింది. 2024 మార్చి, ఏప్రిల్‌, మే మాసాల్లో పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. మరీ అలాంటి పరిస్థితుల్లో భర్తీ ప్రక్రియ ఎలా కొనసాగిస్తారని అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇది కేవలం ఉద్యోగార్థులను, యువతను మోసం చేసే ఎత్తుగడగా అర్థమవుతోంది. ఇక కాంగ్రెస్‌ గొప్పగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లో కేవలం పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సంతకం ఉండి.. సీఎల్పీ లీడర్ భట్టి సంతకం లేకపోవడం కూడా వివాదాస్పదంగా మారింది. ఇది ప‌లు అనుమానాలకు తావిస్తోంది. ఇక ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదలై వివిధ దశల్లో ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మాటేంటి... వాటిని రద్దు చేస్తారా.. లేదా అనే దానిపై కూడా క్లారిటీ లేదు.

ఇక రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అనేది అసలు కార్యారూపం దాల్చుతుందా..! అది ఏడాదిలోగా.. అసలు అంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల భర్తీ సాధ్యమయ్యే పనే కాదంటున్నారు అనుభవజ్ఞులు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మళ్లీ అదనంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అంటే అందుకు కావాల్సిన బడ్జెట్‌ ఎంత..? అసలు ఈ లెక్కలపై అవగాహన లేకుండా హామీ ఇచ్చేసి అధికారంలోకి వస్తే చూసుకుందాంలే అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ వైఖరి. కాంగ్రెస్‌ ఇస్తున్న హామీలకు వాస్తవ పరిస్థితికి పొంతనే లేదంటున్నారు విశ్లేషకులు.

కర్ణాటకలో యువనిధి పథకం కింద రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ఆరు నెలలు గడుస్తున్నా ఒక్కటంటే ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేసిన దాఖలాలు లేవు. అసలు ఆ హామీని కర్ణాటక ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించింది. ఎన్నికల్లో గెలిచేందుకు భారీ ఉచితాలు ప్రకటించిన కర్ణాటక కాంగ్రెస్.. ఇప్పుడు వాటిని అమలు చేయలేక, అభివృద్ధి పనులకు నిధుల్లేక చేతులెత్తేసిన పరిస్థితి. మరీ అలాంటి కాంగ్రెస్‌ మాటలను ఇప్పుడు తెలంగాణ యువత ఎలా నమ్మాలి..? అసలు ఏ పార్టీ అయినా లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటే అది మోసపూరిత హామీనే. ఎందుకంటే ఇప్పటివరకూ దేశంలో నిర్ణీత గడువులోగా అంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన దాఖలాలు లేనే లేవు.

Tags:    
Advertisement

Similar News