నల్గొండలో ఉన్మాది ఘాతుకం... ప్రేమను తిరస్కరించినందుకు అమ్మాయి గొంతుకోశాడు
నల్గొండలో ప్రేమ పేరుతో ఓ యువతిపై రోహిత్ అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. అమ్మాయి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు.
నల్గొండపట్టణంలో తన ప్రేమ తిరస్కరించిందనే కక్షతో రోహిత్ అనే ఉనాది నవ్య అనే యువతిపై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
డిగ్రీ చదువుతున్న నవ్యను బీబీఏ చదువుతున్న రోహిత్ గత కొన్నినెలలుగా ప్రేమించాలంటూ వెంటపడుతున్నాడని పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఒక సారి రోహిత్ నవ్యపై దాడి చేశాడని అప్పుడు రోహిత్ తల్లితండ్రులకు నవ్య, ఆమె సోదరుడు కలిసి పిర్యాదు చేయగా మరో సారి అలా జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో పోలీసులకు పిర్యాదు చేయలేదు. అయినప్పటికీ రోహిత్ తన వేధింపులు ఆపలేదు.
ఇవ్వాళ్ళ మధ్యాహ్నం నవ్యకు, రోహిత్ కు స్నేహితురాలైన మరో అమ్మాయి ద్వారా నవ్యను బైటికి రప్పించాడు రోహిత్. తన పుట్టిన రోజంటూ ఆ అమ్మాయి నవ్యను ఫారెస్ట్ పార్క్ కు తీసుకెళ్ళింది. అప్పటికే అక్కడ వేచి ఉన్న రోహిత్ నవ్యతో గొడవ పడ్డాడు. ప్లాన్ ప్రకారం తనతో కత్తి తెచ్చుకున్న రోహిత్ హటాత్తుగా నవ్యపై దాడికి పాల్పడ్డాడు. దాదాపు ఏడు పోట్లు పొడిచాడని పోలీసులు చెప్తున్నారు. మొహంపై, కడుపులో చేతులపై, గొంతుపై లోతుగా గాయాలయ్యాయి.
వైద్యులు ప్రస్తుతం నవ్యకు ఐసీయూ లో చికిత్స చేస్తున్నారు. 48 గంటలైతే తప్ప నవ్య ఆరోగ్య పరిస్థితి గురించి స్పష్టంగా ఏమీ చెప్పలేమని వైద్యులు చెప్తున్నారు. మరో వైపు ఉన్మాది రోహిత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.