నిర్మాణంలోని వంతెన.. ఉన్నట్టుండి కుప్పకూలింది
వాగులో నీళ్లు తక్కువగా ఉండటంతో వంతెన కిందనుంచే రైతులు, స్థానికులు రాకపోకలు సాగిస్తుంటారు. పగటిపూట వంతెన కూలి ఉంటే ప్రాణ నష్టం జరిగే అవకాశముందని అంటున్నారు.
తెలంగాణలో నిర్మాణంలోని వంతెన కుప్పకూలిన ఘటన సంచలనంగా మారింది. పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై ఈ వంతెన నిర్మిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా, జయశంకర్ భూపాల పల్లి జిల్లాలను కలుపుతూ ఈ వాగుపై వంతెన నిర్మాణం జరుగుతోంది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు నుంచి జయశంకర్ భూపాల పల్లి జిల్లా గర్మిళ్ల పల్లి మధ్య 2016 నుంచి నిర్మిస్తున్న వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు నిర్మాణంలోని వంతెన కుప్పకూలడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడం విశేషం.
వాగులో నీళ్లు తక్కువగా ఉండటంతో వంతెన కిందనుంచే రైతులు, స్థానికులు రాకపోకలు సాగిస్తుంటారు. పగటిపూట వంతెన కూలి ఉంటే ప్రాణ నష్టం జరిగే అవకాశముందని అంటున్నారు. అర్థరాత్రి ఈదురుగాలులకు వంతెన కూలిందని చెబుతున్నారు. ప్రమాదం జరిగినా, ప్రాణ నష్టం తప్పింది.
2016లో వంతెన నిర్మాణం మొదలైనా.. వివిధ కారణాల వల్ల అది ఆలస్యం అవుతోంది. మధ్యలో కాంట్రాక్టర్లు మారడంతో అది మరింత ఆలస్యమైంది. ఇప్పటికీ ఇంకా పనులు ఓ కొలిక్కి రాలేదు. ఈలోగా వంతెన బీమ్ లు పడిపోయాయి. వంతెన నిర్మాణం నాణ్యతపై కూడా విమర్శలు వినపడుతున్నాయి. పిల్లర్లు, గట్టర్లకు మధ్య బ్యాలెన్సింగ్ కోసం ఏర్పాటు చేసిన కొయ్యలకు చెదలు పట్టినట్టు చెబుతున్నారు స్థానికులు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా వారు పెడచెవిన పెట్టారని అంటున్నారు. ఈ చెదలు వల్ల అవి ఓవైపుకి ఒరిగిపోయాయని, దానికి తోడు అర్థరాత్రి ఈదురు గాలులకు అవి పక్కకు పడిపోయాయని అంటున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.