కలసిన చేతులు.. కేటీఆర్ ముందు మంచిర్యాల పంచాయితీ
టికెట్ల ప్రకటన సందర్భంలో విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్, హైదరాబాద్ కి తిరిగొచ్చిన తర్వాత అసంతృప్తులు ఆయన్ను కలుస్తున్నారు. కొన్నిచోట్ల నేతల్ని మంత్రి స్వయంగా పిలిపించుకుని మాట్లాడుతున్నారు.
మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే బీఆర్ఎస్ టికెట్లు దక్కాయి. దీంతో ఆశావహులు సహజంగానే రగిలిపోతున్నారు. మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుకి సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించారు. టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ అలిగారు. సర్వేల్లో తానే ముందున్నానని, అయినా తనను పట్టించుకోలేదని, దివాకర్ రావుని ఓడిస్తానంటూ అరవింద్ రెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తి వెలిబుచ్చారు. ఇక తనకు టికెట్ రాకపోవడానికి కారణం ఎమ్మెల్యే బాల్క సుమన్ అంటూ.. ఆయన్ను చెన్నూరులో ఓడిస్తానని పురాణం సతీష్ కూడా ప్రతిజ్ఞ చేశారు. చివరకు వీరిద్దరూ కేటీఆర్ వద్ద రాజీ పడటం విశేషం.
మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ సెక్రటేరియట్ లో మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. వారితో ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య కూడా ఉన్నారు. అరవింద్ రెడ్డి, సతీష్ కుమార్ తో వేర్వేరుగా భేటీ అయిన కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు సహకరించాలని చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పకుండా ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. దీంతో మంచిర్యాల పంచాయితీ అక్కడితో ముగిసినట్టు తెలుస్తోంది.
కేటీఆర్ వద్ద పంచాయితీలు..
టికెట్ల ప్రకటన సందర్భంలో విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్, హైదరాబాద్ కి తిరిగొచ్చిన తర్వాత అసంతృప్తులు ఆయన్ను కలుస్తున్నారు. కొన్నిచోట్ల నేతల్ని మంత్రి స్వయంగా పిలిపించుకుని మాట్లాడుతున్నారు. పార్టీకి నష్టం కలిగించొద్దని, ప్రతి ఒక్కరికీ పార్టీ సముచిత గౌరవం ఇస్తుందని నచ్చజెబుతున్నారు. ఆయన్ను కలసిన తర్వాత చాలామంది మెత్తబడ్డారు. మంచిర్యాల పంచాయితీ కూడా ఇలాగే ముగిసిందని, సిట్టింగ్ ఎమ్మెల్యే నడిపెల్లికి అసంతృప్తుల గోల తప్పిందని అంటున్నారు.