రేవంత్ చెప్పారు.. నాగర్‌కర్నూల్ టికెట్ నాదే - మల్లు రవి
మరోవైపు విపక్షాలపై ఆరోపణలు చేశారు రవి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీల మధ్య పొత్తుల కోసం చర్చలు జరుగుతున్నాయన్నారు. బీజేపీతోనూ బీఆర్ఎస్ అవగాహనతో వెళుతోందని విమర్శించారు.
నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్ కోసం చావోరేవో అంటూ పోరాడుతున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. ఆ టికెట్ కోసం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవికి కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు టికెట్ తనదేనని, ఈ విషయం సీఎం రేవంత్‌రెడ్డి కూడా చెప్పారని తాజాగా ఆయన ప్రకటించారు. దీంతో నాగర్‌కర్నూలు టికెట్ వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది.
సంపత్, రవి మధ్యే పోటీ
నాగర్‌కర్నూలు ఎస్సీ లోక్‌సభ నియోజకవర్గం. ఇక్కడ కాంగ్రెస్ టికెట్ కోసం మొదట్లో చాలామంది కర్ఛీఫ్ వేశారు. కానీ చివరికి ఇక్కడ మాజీ ఎంపీ మల్లు రవికి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కు మధ్యలో టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. దీన్ని కంట్రోల్ చేయడానికి మల్లు రవికి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవి ఇచ్చి పంపారు. కానీ దాంతో తన టికెట్‌కు ఎసరు పెడుతున్నారని భావించిన ఆయన ఆ పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎంపీ టికెట్ రేస్‌లోకి దూకారు. సర్వేలన్నింటిలోనూ తానే ముందున్నానని, టికెట్ తనదేనని పదేపదే ప్రకటిస్తున్నారు.
బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ కుమ్మక్కు
మరోవైపు విపక్షాలపై ఆరోపణలు చేశారు రవి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీల మధ్య పొత్తుల కోసం చర్చలు జరుగుతున్నాయన్నారు. బీజేపీతోనూ బీఆర్ఎస్ అవగాహనతో వెళుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి భయంతో ముందుకు రాకపోవడం వల్లే ఇలా మిగిలిన పార్టీలతో కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని కామెంట్ చేశారు.