తెలంగాణ బిడ్డకు మొదటి వెన్నుపోటు..!
తనకు కాకపోయినా వేరే తెలంగాణ వాళ్లకు అవకాశం ఇచ్చిన బాగుండేదన్నారు మల్లిక్ తేజ. అలా కాకుండా కీరవాణితో పాడించడం బాధగా ఉందన్నారు.
జయ జయహే తెలంగాణ పాటను కీరవాణితో కంపోజ్ చేయించడం పట్ల.. నాడు జయజయహే పాటకు సంగీతం అందించిన ఎస్వీ మల్లిక్ తేజ ఆవేదన వ్యక్తం చేశారు. జయ జయహే పాటకు అర్జెంట్‌గా సంగీతం అందించాలని ఏడాదిన్నర క్రితం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కోరారని ఆయన తెలిపారు. ఆరోజు ఉదయం చెబితే.. అన్ని పనులను పక్కనపెట్టి పాటకు సంగీతం అందించానని చెప్పారు. అప్పుడు ఉన్న తక్కువ సమయంలో, పరిమితమైన బడ్జెట్‌లో పాట రూపకల్పన చేసి ఇచ్చానన్నారు. తాను కంపోజ్ చేసిన పాట అద్భుతంగా ఉందని ఆనాడు అందెశ్రీ ప్రశంసించిన విషయాన్ని మల్లిక్ గుర్తు చేశారు. ఉన్నత ప్రమాణాలతో రూపొందించే అవకాశాన్ని తనకే ఇస్తామని మాట ఇచ్చారని తెలిపారు.
మాట ఇచ్చి.. మోసం
తనకు కాకపోయినా వేరే తెలంగాణ వాళ్లకు అవకాశం ఇచ్చిన బాగుండేదన్నారు మల్లిక్ తేజ. అలా కాకుండా కీరవాణితో పాడించడం బాధగా ఉందన్నారు. కీరవాణి అంటే అందరికి అభిమానమే కానీ.. ఆయన్ని తలదన్నే మ్యూజిక్ డైరెక్టర్ తెలంగాణలోనే లేడని అనడం బాధగా ఉందన్నారు. ఏడాదిన్నర కిందట కూడా కీరవాణితోనే పాడించుకుంటే బాగుండేది కదా అని మల్లిక్ తేజ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు ఆస్కార్ గ్రహీతలు అని.. మీరిచ్చే అవకాశం వాళ్లకు ఆస్కార్ కిందే ఉంటుంది తప్ప ఆస్కార్‌పైన ఉండదని అన్నారు. అదే తమలాంటి చిన్న కళాకారులకు అవకాశమిస్తే మరింత ప్రేమతో పనిచేసేవాళ్లం కదా అని ఆవేదన వ్యక్తం చేశారు మల్లిక్ తేజ.