ట్రయల్ రన్ సక్సెస్.. మంత్రి కేటీఆర్ హర్షం
మల్కపేట రిజర్వాయర్ వినియోగంలోకి వస్తే సిరిసిల్ల నియోజకవర్గంలో 64,470 ఎకరాలు, వేములవాడ నియోజకవర్గంలో 31,680 ఎకరాలకు పైగా సాగునీరు అందుతుంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ-9లో భాగంగా నిర్మించిన మల్కపేట జలాశయం రెండో పంపు ట్రయల్ రన్ విజయవంతమైంది. మే 23న మొదటి పంపు ట్రయల్ రన్ విజయవంతం కాగా.. ఈరోజు రెండో పంపు ట్రయల్ రన్ నిర్వహించారు. ఇది కూడా విజయవంతమైందని తెలిపారు అధికారులు. త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ జలాశయాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఈరోజు వేకువజామున 12.40 నుంచి 1.40 గంటల వరకు దాదాపు గంటసేపు రెండో పంపు ద్వారా ట్రయల్ రన్ కొనసాగింది. ట్రయల్ రన్ సక్సెస్ కావడంపై మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ హర్షం వ్యక్తంచేశారు.
మల్కపేట రిజర్వాయర్ పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే సిరిసిల్ల నియోజకవర్గంలో 64,470 ఎకరాలు, వేములవాడ నియోజకవర్గంలో 31,680 ఎకరాలకు పైగా సాగునీరు అందుతుంది. 60వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు లభించడంతోపాటు, 26,150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది.
వెయ్యి కోట్ల రూపాయలతో టన్నెల్ నిర్మించగా మల్కపేట రిజర్వాయర్ నిర్మాణానికి 500కోట్లు ఖర్చు చేశారు. 3 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా రిజర్వాయర్ నిర్మించారు. ఏడు గుట్టలను అనుసంధానం చేస్తూ మల్కపేట రిజర్వాయర్ నిర్మించారు. 5 కిలోమీటర్ల పొడవు గల ఆరు బండ్ లను నిర్మించారు. రామప్పగుట్ట నుంచి కోనరావుపేట మండలం మల్కపేట వరకు 12.3. కిలోమీటర్ల పొడవున టన్నెల్ నిర్మించారు. 130 మీటర్ల లోతులోని సర్జ్ పూల్ నుంచి 1100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. దీనికోసం 30 మెగావాట్ల సామర్థ్యం గల రెండు విద్యుత్ మోటర్లను బిగించారు. నీటిని ఎత్తిపోసేందుకు 90 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా, 33/11కేవీ విద్యుత్ ప్రత్యేక ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రెండు పంపులకు ట్రయల్ రన్ పూర్తి కావడంతో త్వరలో సీఎం కేసీఆర్ ఈ జలాశయాన్ని ప్రారంభింస్తారని అధికారులు తెలిపారు.