తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధం?

2020 ఫిబ్రవరి 3న ప్రభుత్వం ఒకే సారి 50 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఇందులో అనేక జిల్లాలకు చెందిన కలెక్టర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా అదే రీతిలో ఒకేసారి భారీగా బదిలీలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

Advertisement
Update:2022-11-30 17:38 IST

రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలను పెద్ద ఎత్తున చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. టాప్ లెవల్ బ్యూరోక్రాట్ల పునర్‌ వ్యవస్థీకరణ కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో సీనియర్ అధికారుల బదిలీలు భారీగా జరుగనున్నట్లు తెలుస్తున్నది. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. దీంతో సమర్థత కలిగిన ఆఫీసర్లను కీలక పోస్టుల్లో నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈసారి బదిలీల ద్వారా పూర్తిస్థాయి 'ఎలక్షన్ టీమ్'ను రెడీ చేసుకునే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతున్నది.

సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. వీటిని మరింత వేగంగా అమలు చేయడం, పూర్తి చేయడం ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్న బాధ్యత. ఎన్నికల లోపు ఎలాంటి ఆటంకాలు లేకుండా పెండింగ్ పనులను పూర్తి చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఇందు కోసం సమర్థులైన అధికారులు కీలక స్థానాల్లో ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. అందుకే ఈ సారి భారీగా బదిలీలు ఉంటాయని, ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించిన కసరత్తు పూర్తయి.. ఉత్తర్వులు వెలువడతాయనే ప్రచారం జరుగుతున్నది.

2020 ఫిబ్రవరి 3న ప్రభుత్వం ఒకే సారి 50 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఇందులో అనేక జిల్లాలకు చెందిన కలెక్టర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా అదే రీతిలో ఒకేసారి భారీగా బదిలీలు చేయాలని భావిస్తున్నది. ప్రస్తుతం కొన్ని కీలక శాఖలకు పూర్తి స్థాయి కార్యదర్శులు, కమిషనర్లు, డైరెక్టర్లు లేరు. వీటన్నింటినీ ఇంచార్జులే నడిపిస్తున్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ స్వయంగా కొన్ని శాఖ బాధ్యతలను చూస్తున్నారు. ఆదాయం వచ్చే రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ శాఖలు సోమేశ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.

అంతే కాకుండా సీసీఎల్ఏ కమిషనర్‌గా ఫుల్ అడిషనల్ చార్జ్‌లో సోమేశ్ ఉన్నారు. దీంతో పాటు తెలంగాణ రెరా చైర్మ‌న్‌ పదవిలో కూడా సీఎస్ ఉండటంతో ఆయనపై పని ఒత్తిడి పెరిగిపోయింది. మరోవైపు రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు పూర్తి స్థాయిలో కలెక్టర్లు లేరు. ప్రస్తుతం పక్క జిల్లా కలెక్టర్లే అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కొంత మంది ఐఏఎస్‌లు ఒకే స్థానంలో కొనసాగుతున్నారు. వీరందరినీ బదిలీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

ఐఏఎస్‌ల బదిలీలు పూర్తి అయిన వెంటనే ఐపీఎస్‌ల బదిలీలు కూడా ఉండనున్నాయి. డీజీపీ మహేందర్ రెడ్డి డిసెంబర్ నెలాఖరుతో పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్రానికి కొత్త డీజీపీని కూడా నియమించాల్సి ఉన్నది. దాంతో పాటు ఐపీఎస్‌ల బదిలీలు కూడా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఐదు కన్‌ఫర్డ్ ఐఏఎస్ పోస్టులను కూడా భర్తీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. సాధారణంగా రెవెన్యూ విభాగంలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని కన్‌ఫర్డ్ ఐఏఎస్‌గా ప్రమోట్ చేస్తుంటారు. అయితే నాన్-రెవెన్యూ శాఖల్లో కూడా కన్‌ఫర్డ్ ఐఏఎస్ ప్రమోషన్లు ఇవ్వడానికి యూపీఎస్‌సీ అనుమతి ఇస్తోంది. అయితే ప్రతీ శాఖ నుంచి ఐదుగురిని సిఫార్సు చేస్తే వారిని యూపీఎస్సీ ఇంటర్వ్యూ చేసి ఒకరికి ఐఏఎస్ హోదా ఇస్తుంది.

ఇప్పుడు నాన్-రెవెన్యూ కేటగిరీ కింద ప్రతీ డిపార్ట్‌మెంట్ నుంచి ఐదుగురి పేర్లను యూపీఎస్సీకి పంపాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. డిసెంబర్ 3లో ఈ లిస్టు అక్కడకు చేరాలని సూచించారు. త్వరలోనే వీరికి సంబంధించిన ఇంటర్వ్యూలు కూడా పూర్తయితే రాష్ట్రంలో ఐదుగురు కన్‌ఫర్డ్ ఐఏఎస్‌లుగా ప్రమోట్ అవుతారు.

Tags:    
Advertisement

Similar News