15 ఎకరాల మెట్రో భూమిని 1500 కోట్లకు అమ్మిన ఎల్అండ్‌టీ.. చేతిలో మరో 100 ఎకరాలు!
హైదరాబాద్ మెట్రో నిర్మాణం చేపట్టిన ఎల్ అండ్ టీ సంస్థకు నిబంధనల ప్రకారం భవిష్యత్ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రాయదుర్గంలో 15 ఎకరాల భూమిని కేటాయించింది.
రాయదుర్గం వద్ద ప్రభుత్వం తమకు కేటాయించిన భూమిలో 15 ఎకరాలను హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ అమ్మేసింది. రాఫర్టీ డెలవప్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఈ భూమిని విక్రయించింది. హైదరాబాద్‌లో ఎకరా వంద కోట్లు పలుకుతున్న ప్రస్తుత తరుణంలో రాయదుర్గం లాంటి ఖరీదైన ప్రాంతంలో ఏకంగా 15 ఎకరాలు అమ్మితే ఎల్‌అండ్‌టీకి ఎంత సొమ్ము వచ్చి ఉంటుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
రూ.1,500 కోట్లకు అమ్మకం
హైదరాబాద్ మెట్రో నిర్మాణం చేపట్టిన ఎల్ అండ్ టీ సంస్థకు నిబంధనల ప్రకారం భవిష్యత్ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రాయదుర్గంలో 15 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో ఇప్పటికే ఆ సంస్థ ఓ భవనం కూడా నిర్మించింది. దాంతో కలిపే ఆ మొత్తం భూమిని రాఫర్టీకి విక్రయించింది. ఈ డీల్ విలువ రూ.1500 కోట్లని చెబుతున్నారు.
269 ఎకరాల కేటాయింపు
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఎల్ అండ్ టీకి హైదరాబాద్ నగరంలో మొత్తం 269 ఎకరాలు కేటాయించింది. ఇందులో మెట్రో డిపోలున్న నాగోల్ దగ్గర 104 ఎకరాలు, మియాపూర్ దగ్గర 96 ఎకరాలు కేటాయించింది. ఇవికాక మరో 69 ఎకరాల భూమి ఇచ్చింది. అందులో భాగంగానే రాయదుర్గంలో ఇచ్చిన 15 ఎకరాలను తాజాగా ఎల్ అండ్ టీ అమ్మింది. ఈ లెక్కన చూస్తే ఆ పైన ఇంకో 54 ఎకరాలున్నాయి. అవికాక మెట్రో డిపోల దగ్గర కూడా చాలా భూమి ఉంది. అంతా కలిపి 100 ఎకరాల పైనే ఉంటుందని అంచనా. ఈ లెక్కన ఎల్ అండ్ టీ పంట పండినట్లే కనిపిస్తోంది.