మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులకు L&T సిద్ధం..
ప్రస్తుతం నిపుణులు, అధికారులు ఈ పిల్లర్ కుంగుబాటు విషయంలో తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి చర్చిస్తున్నారని, వారి సూచనల మేరకు L&T రంగంలోకి దిగుతుందని చెప్పారు. దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించడానికి L&T సిద్ధంగా ఉందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ పిల్లర్ కుంగిన ఘటనపై నిర్మాణ సంస్థ L&T తాజాగా స్పందించింది. మరమ్మతులకు తాము సిద్ధంగా ఉన్నట్టు సంస్థ ప్రతినిధులు ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం నిపుణులు, అధికారులు ఈ పిల్లర్ కుంగుబాటు విషయంలో తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి చర్చిస్తున్నారని, వారి సూచనల మేరకు L&T రంగంలోకి దిగుతుందని చెప్పారు. దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించడానికి L&T సిద్ధంగా ఉందన్నారు.
గత నెల 21వతేదీన మేడిగడ్డ బ్యారేజ్ ఏడో బ్లాక్ లో 20వ పియర్ దెబ్బతిన్నది. కొన్నిచోట్ల పగుళ్లు కనిపించాయి, పిల్లర్ కాస్త కిందకు కుంగినట్టుగా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో అక్కడ రాకపోకలను నిషేధించారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఇది రాజకీయాలకు కూడా కేంద్ర బిందువుగా మారింది. కాంగ్రెస్, బీజేపీ నేతలు హెలికాప్టర్లలో బ్యారేజ్ సందర్శనకు వచ్చారు, రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టారు. అటు బీఆర్ఎస్ కూడా అంతే ధీటుగా ఆ విమర్శలకు సమాధానాలిచ్చింది.
మేడిగడ్డ బ్యారేజ్ ని L&T సంస్థ నిర్మించి 2019లో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. గత ఐదు వరద సీజన్ లను తట్టుకుని ఈ బ్యారేజీ నిలబడింది. అయితే ఇప్పుడు పిల్లర్ కుంగుబాటుతో ఈ బ్యారేజీ వార్తల్లోకెక్కింది. ఈ బ్యారేజ్ నిర్మించిన L&T సంస్థపైనే.. దాని నిర్వహణ బాధ్యత కూడా ఉందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. L&T సంస్థ కూడా పిల్లర్ మరమ్మతులకోసం ముందుకొచ్చినట్టు తెలిపింది. నిపుణుల బృందం సూచన మేరకు మరమ్మతులు మొదలుపెడతామని స్పష్టం చేసింది.