కాకతీయ యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌పై లోకాయుక్త ధిక్కరణ కేసు

పదోన్నతులు పొందిన వారందరూ యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తుల్లో పూర్తిగా సమాచారం ఇవ్వలేదని.. వీరి పదోన్నతి ఆమోదాలు కూడా పాలక మండలిలో పూర్తి కోరం లేకుండానే ఆమోదం పొందాయిన ఆరోపిస్తూ ఈ. రేణుక లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు.

Advertisement
Update:2023-02-11 16:28 IST

తెలంగాణలోని వరంగల్ కేంద్రంగా ఉన్న కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌పై లోకాయుక్త ధిక్కరణ కేసు నమోదయ్యింది. గతంలో పదోన్నతుల విషయంలో లోకాయుక్త ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదంటూ యూనివర్సిటీకి చెందిన ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్ మాజీ హెచ్ఓడీ ఈ.రేణుక లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 4న కేయూ వీసీ సహా మరో ముగ్గురిపై లోకాయుక్త ధిక్కరణ కేసు నమోదు అయ్యింది.

ఇటీవలే వైస్ ఛాన్స్‌లర్ తాటికొండ రమేశ్, మాజీ రిజిస్ట్రార్ వెంకట్ రామ్ రెడ్డి, ఫైనాన్స్ ఆఫీసర్ రాజయ్యపై కేయూ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది. తాజాగా వీసీతో పాటు ప్రస్తుత రిజిస్ట్రార్ టి. శ్రీనివాస్, మాజీ రిజిస్ట్రార్ వెంకట్ రాంరెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పెండ్లి అశోక్ బాబుపై లోకాయుక్త ధిక్కరణ కేసు నమోదు కావడం విశ్వవిద్యాలయంలో చర్చనీయాంశంగా మారింది.

కేయూలో 2017, 2018తో పాటు 2022లో అధ్యాపకులకు పదోన్నతులు కల్పించారు. 2017లో 9 మందికి అసోసియేట్ ప్రొఫెసర్ హోదా నుంచి ప్రొఫెసర్లుగా, ముగ్గురికి అసిస్టెంట్ ప్రొఫెసర్ల హోదా నుంచి అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించారు. ఇక 2018లో ఇద్దరికి అసోసియేట్ ప్రొఫెసర్ల హోదా నుంచి ప్రొఫెసర్లు, 20 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నుంచి అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందారు. ఇక 2022లో ఒకరికి సీనియర్ ప్రొఫెసర్‌గా పదోన్నతి ఇచ్చారు.

ఆయా సంవత్సరాల్లో పదోన్నతులు పొందిన వారందరూ యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తుల్లో పూర్తిగా సమాచారం ఇవ్వలేదని.. వీరి పదోన్నతి ఆమోదాలు కూడా పాలక మండలిలో పూర్తి కోరం లేకుండానే ఆమోదం పొందాయని ఆరోపిస్తూ ఈ.రేణుక లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఈ పదోన్నతులన్నీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యాక్ట్ ప్రకారం చెల్లవని ఆమె పేర్కొన్నారు. కాగా, ఈ ఫిర్యాదుపై విచారణ చేసిన లోకాయుక్త.. గతేడాది ఆగస్టు, నవంబర్ నెలల్లో పదోన్నతుల ప్రక్రియపై పూర్తి పాలక మండలి ఆమోదం తీసుకోవాలని వీసీ, రిజిస్ట్రార్‌లకు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.

నిరుడు అగస్టు నుంచి ఇప్పటికి రెండు సార్లు పాలక మండలి సమావేశాలు జరిగినా పదోన్నతులపై ఎలాంటి చర్చ జరగలేదు. పైగా ఆ పదోన్నతులపై సమగ్ర విచారణ జరపాలని లోకాయుక్త ఆదేశించినా.. వాటిని పాటించలేదు. దీంతో ఈ నెల 4న రేణుక మరోసారి లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో.. వారిపై ధిక్కరణ కేసు నమోదయ్యింది.

మరోవైపు వీసీ రమేశ్ 2010లో ప్రొఫెసర్‌గా ప్రమోషన్ పొందిన విధానం తప్పని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా మాజీ రిజిస్ట్రార్ వెంకట్ రాంరెడ్డి కూడా ప్రమోషన్ పొందడానికి తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వాన్ని తప్పు దోప పట్టించి ఒక జీవో ద్వారా పాత సర్వీసును కూడా కలుపుకొని 2017లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా, 2018లో ప్రొఫెసర్‌గా ప్రమోషన్ పొందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ఫిర్యాదులన్నింటిపై పోలీసు కేసులే కాకుండా లోకాయుక్త కేసులు కూడా నమోదయ్యాయి.

Tags:    
Advertisement

Similar News