తెలంగాణలో ముగిసిన మద్యం దరఖాస్తు గడువు.. లక్ష దాటిన అప్లికేషన్ల అమ్మకం
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల కోసం ఈ నెల 4 నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. నాన్-రిఫండబుల్ అమౌంట్ కింద రూ.2 లక్షల డీడీ చెల్లించి దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.
తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల అమ్మకం, స్వీకరణ శుక్రవారంతో ముగిసింది. ఆబ్కారీ శాఖ అంచనాలను మించి ఈ ఏడాది దరఖాస్తుల అమ్మకం జరిగింది. గురువారం సాయంత్రం నాటికే 69,965 దరఖాస్తుల అమ్మకం ద్వారా రూ.1,399 కోట్ల ఆదాయం లభించింది. 2021లో దరఖాస్తుల అమ్మకం ద్వారా రూ.1,357 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే గురువారం నాటికే రూ.1,399 కోట్ల ఆదాయం లభించింది. ఇప్పటికే దరఖాస్తులు 1 లక్ష దాటినట్లు తెలుస్తున్నది. దీంతో ఆబ్కారీ శాఖకు దాదాపు రూ.2వేల కోట్ల ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల కోసం ఈ నెల 4 నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. నాన్-రిఫండబుల్ అమౌంట్ కింద రూ.2 లక్షల డీడీ చెల్లించి దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. శుక్రవారం దరఖాస్తులకు చివరి రోజు కావడంతో భారీ ఎత్తున అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉన్నది. కాగా, ఇప్పటికీ పలు జిల్లాల్లో దరఖాస్తుదారులు క్యూలో నిల్చొని ఉన్నారు. ఈ రోజు అర్థరాత్రి 12 గంటల వరకు దరఖాస్తులు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఈ నెల 20న ఆయా జిల్లాల ఎక్సైజ్ కార్యాలయాల్లో డ్రా తీసి మద్యం దుకాణాలు కేటాయిస్తారు.
రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాల్లో 363 దుకాణాలు గౌడ్‌లకు, 262 ఎస్సీలకు, 131 ఎస్టీలకు కేటాయించారు. ఇవి పోగా మిగిలిన 1,864 మద్యం దుకాణాలు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో డ్రా తీసి.. కొత్త దుకాణాలు కేటాయిస్తారు. డిసెంబర్ 1 నుంచి అమలులోనికి రానున్న నూతన మద్యం విధానంలో భాగంగా ఈ దుకాణాలు ఏర్పాటు కానున్నాయి.
రాష్ట్రంలో ఇప్పటికే లక్ష దరఖాస్తులు దాటి పోయాయి. అత్యధికంగా శంషాబాద్, సరూర్‌నగర్ ఎక్సైజ్ డిస్ట్రిక్ పరిధిలో 8 వేల చొప్పున దరఖాస్తులు వచ్చాయి. శంషాబాద్ అబ్కారీ జిల్లా పరిధిలో ఉన్న 100 షాపులు ఉండగా 8,400 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో దుకాణానికి సగటున 84 దరఖాస్తులు వచ్చాయి. సరూర్‌నగర్‌లో 134 దుకాణాలు ఉండగా 8,263 దరఖాస్తులు వచ్చాయి.
నల్గొండలో 155 మద్యం దుకాణాలకు గాను 6,134 దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో 122 మద్యం దుకాణాలకు గాను 5,906 దరఖాస్తులు వచ్చాయి. మేడ్చెల్ పరిధిలో 114 దుకాణాలకు గాను 5,210 దరఖాస్తులు వచ్చాయి. మల్కాజిగిరి పరిధిలో 88 దుకాణాలకు గాను 4,998 దరఖాస్తులు వచ్చాయి. వరంగల్ అర్బన్‌లో 65 దుకాణాలకు 4,590 దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ శుక్రవారం సాయంత్రం 4 గంటల లోపు వచ్చిన దరఖాస్తులు మాత్రమే అని.. అర్థరాత్రి లోపు మరిన్ని దరఖాస్తులు వస్తాయని అధికారులు చెబుతున్నారు.
డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాలు ఏర్పాటు అవుతాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు.. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. దీంతో మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయనే అంచనాల మేరకు దరఖాస్తుదారుల సంఖ్య మరింతగా పెరిగిందని అధికారులు అంటున్నారు. ఈ సారి తెలంగాణ ప్రాంతం వారే కాకుండా ఏపీ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, ఎంపీ, మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు కూడా భారీగా మద్యం దుకాణాల కోసం పోటీ పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.