మన గొంతు తడిపిన సీఎం కేసీఆర్ వెంట నడుద్దాం : మంత్రి కేటీఆర్

తండాలు, గిరిజన గూడేలు ఏనాడైనా పంచాయతీలుగా మారతాయని కలగన్నామా? మండల కేంద్రం కావాలని అడిగితేనే ఆనాటి ప్రభుత్వాలు ఇవ్వలేదు. కానీ కేసీఆర్ ములుగును జిల్లా కేంద్రంగా చేశారు.

Advertisement
Update:2023-06-07 14:32 IST

మన గొంతు తడిపిన సీఎం కేసీఆర్ వెంట ప్రతీ ఒక్కరు నడవాలి. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి మహా కవి ఆనాడు జైలు గోడలపై రాశారు. మన సీఎం కేసీఆర్ రాష్ట్రమంతా నీళ్లు పారించి నా తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణిగా చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు సాగునీటి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన సాగునీటి ఉత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.

ఇంతకు ముందు హెలీకాప్టర్‌లో ములుగు వస్తుంటే ప్రతీ చెరువు, చెక్ డ్యామ్ నిండు కుండలా కనిపించాయి. ఎర్రటి ఎండాకాలంలో కూడా మత్తడి దుముకుతున్నాయి. ఇదంతా సీఎం కేసీఆర్ ఘనతే అని మంత్రి చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో జరిగిన సుదీర్ఘ పోరాటానికి నాయకత్వం వహించిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ఎన్ని చేస్తున్నా.. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

పక్కనే ఉన్న చత్తీస్‌గడ్‌లో ఎంత పంట పండినా ఎకరానికి 10 క్వింటాలు మాత్రమే కొంటున్నారు. అక్కడ రైతులకు పెట్టుబడి సాయం కేవలం రూ.2వేలు మాత్రమే అందుతున్నది. కానీ తెలంగాణలో రైతులు ఎంత పండిస్తే.. అంత ధాన్యం మద్దతు ధర చెల్లించి కొంటున్నది. ఎరకాకు రూ.10 వేలు రైతు బంధు అందిస్తున్నది. చత్తీస్‌గడ్‌లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా.. మరి ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ఎందుకు కేసీఆర్‌పై విమర్శలు చేయడం అని ప్రశ్నించారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గర కంటే తెలంగాణలో రైతు ఎంతో సంతోషంగా ఉన్నాడని కేటీఆర్ అన్నారు.

తండాలు, గిరిజన గూడేలు ఏనాడైనా పంచాయతీలుగా మారతాయని కలగన్నామా? మండల కేంద్రం కావాలని అడిగితేనే ఆనాటి ప్రభుత్వాలు ఇవ్వలేదు. కానీ కేసీఆర్ ములుగును జిల్లా కేంద్రంగా చేశారు. తండాలు, గిరిజన గూడేలను పంచాయతీలుగా మార్చారు. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ ఘనత కాదా అని ప్రశ్నించారు. ఈ రోజు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనాలకు శంకుస్థాపన చేశాము. ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు, మోడల్ బస్‌స్టాండ్ సముదాయ నిర్మాణం, సేవాలాల్ భవన నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

ఎన్నాటి నుంచో పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని మీరు డిమాండ్ చేశారు. త్వరలోనే అందరికీ పోడు భూముల పట్టాలు అందుతాయి. అంతే కాకుండా ఆ భూయజమానులకు రైతు బంధు కూడా అమలు అవుతుందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణకు ఏమొచ్చిందని దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని పలువురు అడుగుతున్నారు. ఈనాడు ములుగు జిల్లాకు దేశ స్థాయిలో జాతీయ పంచాయతీ అవార్డుల్లో రెండో ర్యాంకు వచ్చింది. ములుగు జిల్లాలో 67 కొత్త గ్రామ పంచాయతీలు అయ్యాయి. 2 కొత్త మండలాలు వచ్చాయి. త్వరలోనే మల్లంపల్లి మండలం చేయమని అడుగుతున్నారు. వీలుంటే అది కూడా సాకారం అవుతుందని కేటీఆర్ అన్నారు.

ప్రతీ ఏడాది వానాకాలం వస్తే ములుగుతో పాటు ఎజెన్సీ ప్రాంతాల్లో మంచ పట్టిన మన్యం అనే వార్తలు వచ్చాయి. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత ఏనాడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించారు. సర్కారు దవాఖానా అంటే భయపడే రోజుల నుంచి ములుగులో మెడికల్ కాలేజీ వచ్చేంతగా ఎదిగింది. జూనియర్, డిగ్రీ కాలేజీ కావాలంటే ఎన్నో దరఖాస్తులు చేయాల్సి వచ్చేది. కానీ, ఎవరూ అడగకుండానే మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 80 శాతం ప్రసవాలతో ములుగు రికార్డులకు ఎక్కింది. ఇవన్నీ విజయాలు కాదా అని కేటీఆర్ అన్నారు.

ఆనాడు కాంగ్రెస్ పార్టీ రూ.200 పెన్షన్ ఇచ్చి ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ రూ.2000 పెన్షన్ ఇస్తున్నారు. ఉచిత విద్యుత్, కల్యాణ లక్ష్మీ, రైతు బీమా, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి ఎన్నో పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

Tags:    
Advertisement

Similar News