అవినీతి, అరాచక కాంగ్రెస్ ను గద్దె దించే వరకు పోరాడుదాం
గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ ప్రభుత్వ అన్యాయాలను బయట పెట్టాం.. అదే స్ఫూర్తితో పని చేద్దాం : కేటీఆర్
అవినీతి, అరాచక కాంగ్రెస్ ను గద్దె దించే వరకు పోరాడుదామని పార్టీ నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కొత్త సంవత్సరం సందర్భంగా పార్టీ శ్రేణులకు గురువారం ఆయన సందేశమిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ తుగ్లక్ విధానాలు.. నిరంకుశ పాలన.. హామీల ఎగవేత.. మోసపూరిత ప్రభుత్వ తీరుపై పోరాటం కొనసాగిద్దామన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలు, అన్యాయాలను బయట పెట్టామని, అదే స్ఫూర్తితో కొత్త ఏడాదిలోనూ ముందుకు సాగుదామన్నారు. ఏడాదిగా కాంగ్రెస్ నిరంకుశ పాలనపై గులాబీ సైనికులు పోరాట స్ఫూర్తి చాటారని, వారందరికీ సలాం చేస్తున్నానని తెలిపారు. వారి కదనోత్సాహం కొండంత స్ఫూర్తిని నింపిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులు విరామం ఎరుగకుండా పోరాడుతున్నారని.. అబద్ధపు పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తుగ్లక్ పాలనతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి అండగా నిలుస్తున్న తీరు అభినందనీయమన్నారు.
''మూసీలో మూటలవేట'' నుంచి ''లగచర్ల లడాయి'' వరకూ.. అన్యాయం జరిగిన ప్రతిచోటా బాధితుల పక్షాన కార్యకర్తలు కొట్లాడారనీ.. తెలంగాణ ప్రజల గుండెచప్పుడును అడుగుడుగునా ప్రతిధ్వనింపజేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు పార్టీ చేసిన పోరాటాలు.. చరిత్రపై చెరగని సంతకాలుగా నిలుస్తాయన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను, అత్యంత సమర్థంగా తిప్పికొట్టిన సందర్భాలు.. ఈ పోరాటపథంలో నిలిచి ఉండే మైలురాళ్లు మారాయన్నారు. తెలంగాణ ప్రజల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. అసమర్థ, అనాలోచిత కాంగ్రెస్ విధానాలపై.. బీఆర్ఎస్ శ్రేణులు మోగించిన ''జంగ్ సైరన్'' ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించాయన్నారు. బీఆర్‌ఎస్ చేసిన అలుపెరగని పోరాటాలతోనే అదానీ ఆశజూపిన రూ.100 కోట్లను ప్రభుత్వం వెనక్కి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. లగచర్ల లడాయి.. యావత్ దేశం ముందు నియంతృత్వ కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టిందన్నారు. ఏడాదికాలంగా ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో నియంతృత్వ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అక్రమ కేసులు పెట్టినా.. ఎంత వేధించినా.. మొక్కవోని ధైర్యంతో పార్టీ శ్రేణులు నిలబడ్డ తీరు అపూర్వం, అసాధారణం, చారిత్రాత్మకమన్నారు. దశాబ్దాలపాటు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కుక్కలు చింపిన విస్తరిలా మార్చే కాంగ్రెస్ కుట్రలను అడుగడుగునా ప్రశ్నిద్దాం.. నిలదీద్దామని పిలుపునిచ్చారు. పార్టీకి పునాది రాళ్లు.. మూలస్తంభాలు పార్టీ శ్రేణులేనని.. గులాబీ జెండాకు వెన్నుముక కార్యకర్తలేనన్నారు.